
నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలి
కోల్ మూమెంట్ ఈడీ వెంకన్న
మణుగూరు టౌన్: నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి పటిష్ట చర్యలు చేపట్టాలని కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకన్న అన్నారు. శనివారం ఆయన మణుగూరు ఏరియాలో జీఎం దుర్గం రాంచందర్‌తో కలిసి ఓసీ–2, ఓసీ–4 వద్ద జరుగుతున్న బొగ్గు ఉత్పత్తిని పరిశీలించారు. కేసీహెచ్‌పీ బంకర్‌లో రవాణా అవుతున్న బొగ్గు నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 115 లక్షల టన్నుల బొగ్గు లక్ష్యాన్ని సాధించేందుకు కార్మికులు, సూపర్‌వైజర్లు సమష్టిగా కృషి చేయాలని, రక్షణతో పనిచేస్తూ అధికోత్పత్తికి పాటుపడాలని అన్నారు. సింగరేణి కంటే కోల్ ఇండియాలో తక్కువ ధరకు బొగ్గు లభిస్తున్నందున సింగరేణి బొగ్గును తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదన్నారు. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేసి వినియోగదారులకు తక్కువ ధరకు రవాణా చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఉద్యోగులంతా 8 గంటల సమయాన్ని పూర్తిస్థాయిలో పనిచేస్తూ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కేపీయూజీ మైన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సమావేశంలో క్వాలిటీ జీఎం వెంకటరమణ, ఎస్‌ఓటు జీఎం శ్రీనివాసాచారి, అధికారులు వీరభద్రరావు, చంద్రశేఖర్, రాంబాబు, వీరభద్రుడు, రమేశ్, సురేందర్‌రాజు, శివ ప్రసాద్, మదన్‌నాయక్, అనురాధ, సౌరభ్ సుమన్, బైరడ్డి వెంకటేశ్వర్లు, నాగ రమేశ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.