
భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి
సుజాతనగర్: ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కొత్త అంజనాపురంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికు ల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం తొమ్మిదోమైలు తండా పంచాయతీ పరిధిలోని కోటల్ల గ్రామానికి చెందిన ఈసాల ప్రభాకర్ (39) అప్పుడప్పుడూ ఆటోనడుపుతూ ఖాళీసమయంలో తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పాత అంజనాపురం గ్రామానికి చెందిన అతడి బావ జబ్బా బాలకృష్ణ ఇంట్లో తాపీ పని చేసేందుకు శనివారం వచ్చాడు. పాత ఇంటి స్లాబ్‌ను కూలగొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ పైనుంచి కిందపడిపోయాడు. ఆ వెంటనే స్లాబు లోని కొంతభాగం కూలి అతడిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై మృతుడి బందువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.రమాదేవి తెలిపారు.
ఏడుబావుల వద్ద యువకుడి గల్లంతు
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఏడుబావుల వద్ద శనివారం ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జెన్నారం ఎస్టీ కాలనీకి చెందిన ప్రాపర్తి ప్రేమ్‌కుమార్ తన బంధువులు, స్నేహితులతో కలిసి ఏడుబావుల జలపాతం చూసేందుకు వచ్చాడు. జలపాతం వద్ద పైన ఉన్న బావులను చూసేందుకు వెళ్తున్న క్రమాన ప్రేమ్ ప్రమాదవశాత్తు జారి బావిలో పడినట్లు తెలుస్తోది. ఆయన సహచరులు ఎంత గాలించినా ప్రేమ్‌కుమార్ ఆచూకీ లభించలేదు. ఇంతలోనే చీకటి పడడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది.