గిరిజన గురుకులంలో గందరగోళం
● 80 సీట్లు.. 120 మంది విద్యార్థులకు అనుమతి ● ఆ తర్వాత 40 మందిని నిరాకరించిన సుదిమళ్ల హెచ్‌ఎం
ఇల్లెందురూరల్: ప్రైవేటు పాఠశాలల్లో చదువు భారం కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదని భావిస్తున్న విద్యార్థులు గురుకులాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఐదో తరగతి పూర్తయిన గిరిజన విద్యార్థులు ఆరో తరగతిలో చేరేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మెరిట్ సాధించిన విద్యార్థులకు వివిధ పాఠశాలల్లో సీట్లు కేటాయించారు. కాగా, సుదిమళ్ల గిరిజన గురుకులంలో ఆరో తరగతిలో 80 సీట్లు ఉండగా, తమ పాఠశాలలో చేరాలంటూ 120 మంది విద్యార్థులకు సమాచారం అందించారు. దీంతో విద్యార్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు పాఠశాలలో అందజేశారు. అయితే వారిలో 40 మంది సీట్లు రద్దు చేస్తునట్లు ఈనెల 14న హెచ్‌ఎం మాధవి సదరు విద్యార్థులకు సమాచారం అందిచారు. ముందుగా సర్టిఫికెట్లు తీసుకుని నెల రోజులు గడిచాక సీట్లు రద్దు చేస్తున్నట్లు సమాచారం అందించడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గురుకులాల డీసీఓ అరుణకుమారి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో అదనంగా పేర్లు నమోదు కావడంతో సీట్లు రద్దు చేశామని, ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగితా విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. అయితే అదనంగా కేటాయించిన సీట్లపై ఉన్నతాఽధికారులకు సమాచారం చేరవేశామని, వారు తీసుకునే నిర్ణయం ఆధారంగా తాము తదుపరి చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి తెలిపారు.


