సీతాలక్ష్మణ సమేత..
నేడు బలరామావతారంలో దర్శనం
● భద్రగిరి రామయ్య నిజరూప దర్శనం ● కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. చక్కని సీతమ్మ ఒడిలో, పక్కన తమ్ముడు లక్ష్మణుడు, రెండు చేతుల్లో శంఖుచక్రాలతో మరో రెండు చేతుల్లో ధనస్సు, బాణాలను ధరించి లోకరక్షణకు నేనున్నానంటూ భక్తులకు అభయమిస్తూ శుక్రవారం భద్రగిరి రామ య్య నిజరూప దర్శనమిచ్చాడు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి ఆరాధన గావించారు. బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులతోపాటు 12మంది ఆళ్వార్లను కొలువుదీర్చి వేదపండితులు 200 పాశుర పఠనం చేశారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర
శ్రీరామవతార శోభాయాత్రను లయన్ క్లబ్ సహాయ సహకారాలతో కనుల పండువగా జరిపా రు. సంస్థ బాధ్యులు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ శోభాయాత్ర సాగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మహిళల కోలా టాలు మిథిలాస్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామివారిని కొలువుదీర్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విచిత్ర వేషధారణలు, కోలాటాలు ఆకర్షించాయి. నిత్యం అంతరాలయంలో భక్తులచే పూజలందుకునే జగపతి రాముడు.. తన ఆశీస్సులను అందించడానికి వచ్చిన స్వా మివారి అవతారాన్ని చూసి భక్తులు మురిశారు. వ్యక్తిగత సౌఖ్యాలకన్న ధర్మాచరణయే ఉత్తమమైనదని, అదే శాశ్వతమైనదని శ్రీరాముడు లోకానికి చాటి చెప్పాడని, పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, ధర్మ స్వరూపుడు రాముడేనని ఆలయ అర్చకులు, పండితులు రామవతార విశిష్టతను వివరించారు. భక్తులు స్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో బారులుదీరారు. చివరిగా తిరువీధి సేవను ఘనంగా జరిపా రు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్‌రావు, ఏఈవో శ్రవణ్‌కుమార్, ట్రస్టుబోర్డు మాజీ మెంబర్ బూసిరెడ్డి అంకిరెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శ్రీహరికి శయనమైన ఆదిశేషువుని అంశతో జన్మించి, ‘కృషితో నాస్తి దుర్భిక్షం’అన్న నానుడికి ప్రతీకగా నాగలిని ఆయుధంగా ధరించి శ్రీకృష్ణునికి అన్నగా నిలిచి, ఆయనకు ధర్మ స్థాపనలో సహకరించిన అవతారం శ్రీ బలరామావతారం. సంకర్షణునిగా పిలవబడే బలరాముడు ప్రలంబాసురడనే రాక్షసుని సంహరించాడు. ఈ అవతారాన్ని దర్శించిన వారికి మాందిగుళికా గ్రహాల బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు శనివారం బలరామావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.


