పాఠాలు ఎవరు చెప్పాలి?
మంత్రుల దృష్టేది..?
ప్రారంభించారు సరే..
డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని హడావిడి చేశారు. కొత్తగూడెంలో అట్టహాసంగా ప్రారంభించారు. కానీ సదుపాయాలు మాత్రం పూర్తిస్థాయిలో కల్పించలేదు. ఒక్కరు కూడా రెగ్యులర్ అధ్యాపకులు లేరు. ఆరుగురు గెస్ట్ ఫ్యాకల్టీతో నడిపిస్తున్నారు. మరో వైపు జనవరిలో సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. – కొత్తగూడెంఅర్బన్
ఈ నెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అట్టహాసంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించారు. వర్సిటీ ఏర్పాటు నేపథ్యంలో నెలలపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు హడావిడి చేశారు. వర్సిటీకీ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పేరు పెట్టడం గర్వకారణమని, గిరిజన జిల్లాకు అంతర్జాతీయస్థాయిలో ఖ్యాతి వస్తుందని ప్రగల్భాలు పలికారు. కానీ కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేదు. అధ్యాపకుల నియామకంపై దృష్టి పెట్టలేదు. ఇప్పటికై నా మంత్రులు దృష్టిసారించి వర్సిటీ బలోపేతానికి చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.


