చికిత్స పొందుతున్న మహిళ మృతి
జూలూరుపాడు: మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన జూలూరుపాడు సొసైటీ చైర్మన్ చీమలపాటి భిక్షం సతీమణి చీమలపాటి రాధమ్మ(48) రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. రాధమ్మ తల్లి ఇటీవల మృతి చెందగా గురువారం మధిర మండలం జాలిమూడిలో దశదిన కర్మలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భిక్షం, రాధమ్మ దంపతులు బైక్‌పై వెళ్లి తిరిగొస్తున్నారు. ఈ క్రమంలో వైరా మండలం విప్పలమడుగు గ్రామం వద్ద రాధమ్మ లోబీపీతో కళ్లు తిరిగి కిందపడిపోయింది. దీంతో తీవ్ర గాయాలుకాగా ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ రాధమ్మ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాధమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
బూర్గంపాడు: మండల పరిధిలోని మోతె పట్టీనగర్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసు ల కథనం ప్రకారం... ఇరవెండి గ్రామానికి చెందిన లకావత్ గాంధీ(28) గురువారం రాత్రి సారపాక నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మోతెపట్టీనగర్ గ్రామం వద్ద రోడ్డుపై అడ్డంగా వస్తున్న గేదెను తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో గాంధీ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాల వ్యాపారి ఆత్మహత్య
మణుగూరు టౌన్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ పాలవ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ముత్యాలమ్మనగర్‌కు చెందిన పోట్ల ప్రసాద్(46) పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన మనస్తాపం చెంది గురువారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు 100 పడకల ఆస్పత్రికి, అక్కడి నుంచి భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు నందకిశోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మణుగూరు ఎస్‌ఐ మనీష తెలిపారు.
గుండెపోటుతో కాంగ్రెస్ నాయకుడి మృతి
అశ్వారావుపేటరూరల్: మాజీ ఉప సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కోనేరుబజార్‌కు చెందిన దామెరశెట్టి నీలాచలం(75) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నీలాచలం అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయతీకి 2004 నుంచి 2008వ సంవత్సరం వరకు ఉప సర్పంచ్‌గా పని చేశారు.


