పట్టుదలతో అవరోధాలను అధిగమించవచ్చు
ఖమ్మంమయూరిసెంటర్: మనిషిలో పట్టుదల ఉంటే ఎంతటి అవరోధాన్ని అయినా అధిగమించి విజయాలను సాధించవచ్చని జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత అన్నారు. ఆదివారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. వీటిని ప్రారంభించిన విజేత మాట్లాడుతూ.. మనిషిలో పోరాట పటిమ ఉంటే లక్ష్య సాధనకు శారీరక వైకల్యం అడ్డే కాదన్నారు. పలు రంగాల్లో దివ్యాంగులు అనేక విజయాలను సాధించి, ఉన్నత స్థానాలను అధిరోహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు.
ఉత్సాహంగా పోటీలు..
ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన దివ్యాంగుల ఆటల పోటీల్లో 250 మంది పాల్గొన్నారు. అంధులు, బదిరిలు, మూగ, పోలియో విభాగాల వారీగా నిర్వహించిన పోటీల్లో దివ్యాంగులు ప్రతిభ కనబరించారు. వీరి కోసం అధికారులు రన్నింగ్, క్యారమ్స్, చెస్, జావలిన్ త్రో, షార్ట్‌పుట్ నిర్వహించారు. విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేయనున్నట్లు విజేత వెల్లడించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది బిందుప్రసాద్, వేణుగోపాల్, సునీత, రమేష్, చారి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల ఆటల పోటీల ప్రారంభంలో
సంక్షేమ అధికారిణి విజేత


