100 శాతం బొగ్గు ఉత్పత్తికి కసరత్తు
ప్రతీ గనిలో రోజుకు వేయి టన్నులు
● భూగర్భ గనుల్లో డిసెంబర్ వరకు 58 శాతమే పూర్తి ● క్షేత్రస్థాయిలో సమస్యలు ఆరా తీస్తున్న అధికారులు
రుద్రంపూర్: సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025 – 26)లో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఓసీల్లో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి నమోదవుతున్నా భూగర్భ గనుల్లో మాత్రం ఫలితం కానరావడం లేదని చెబుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా 21 భూగర్భ గనుల్లో 100 శాతం ఉత్పత్తి సాధనకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. గనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అక్కడ ఉద్యోగులతో మమేకమై ఉత్పత్తి సాధనకు ఎదురవుతున్న అవాంతరాలపై ఆరా తీస్తున్నారు.
లక్ష్యంలో సగమే..
సింగరేణివ్యాప్తంగా 12 ఏరియాల్లో 21 భూగర్భ గనులు ఉన్నాయి. వీటిలో డిసెంబర్ నాటికి 50,61,368 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు 29,35,132 టన్నుల (58 శాతం) ఉత్పత్తే నమోదైంది. దీంతో లక్ష్యం మేర బొగ్గు ఉత్పత్తి సాధించేలా ఉన్నతాధికారులు సంస్థలోని ఉద్యోగులు, కార్మికులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 25వ తేదీన కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 గనిని కోల్ మూవ్‌మెంట్ ఈడీ వెంకన్న పరిశీలించారు.
ఒక్కోగనిలో రోజుకు 700 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా దీనిని వేయి టన్నులకు పెంచేలా పర్యవేక్షిస్తున్నాం. ఈక్రమంలోనే గనుల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తాం. అందరూ సహకరించి లక్ష్యాలను సాధించాలి.
–బి.వెంకన్న, ఈడీ, కోల్ మూవ్‌మెంట్


