ముగ్ధమనోహరం.. శ్రీకృష్ణావతారం
నేటి కార్యక్రమాలు
భద్రాచలం: ముగ్ధమనోహరమైన రూపం... చూడచక్కని ఆకారం, కిరీటంపై నెమలి ఈకలు.. చెంతనే సీతామహాదేవి, పక్కన లక్ష్మణస్వామితో బంగారపు ఊయలలో ఊగుతున్న రామయ్యకు భక్తులు నీరాజనం పలికారు. భద్రగిరి రామయ్య శ్రీకృష్ణావతారంలో దర్శనమివ్వగా భక్తులు వీక్షించి తరించారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా రామాలయంలో జరుగుతున్న పగల్‌పత్తు ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న స్వామివారి ఆవతారాలు ఆదివారం నాటి శ్రీకృష్ణావతారంతో ముగిశాయి. రాత్రి వేళ నిర్వహించిన ఏరు ఉత్సవం అలరించగా, నేటి తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
వైభవోపేతంగా కిట్టయ్యకు ఊంజల్ సేవ
శ్రీ కృష్ణావతారుడైన శ్రీసీతారామ చంద్రస్వామివారికి వైభవోపేతంగా ఊంజల్ సేవ జరిపారు. ఆస్థాన విద్వాంసులు కీర్తనలు ఆలపించారు. అనంతరం హారతి సమర్పించారు. డోలోత్సవంలో పాల్గొని స్వామివారిని చూసి తరించిన భక్తులకు ఎంతో పుణ్యం దక్కుతుందని పండితులు తెలిపారు. వెన్న, అటుకులు, బెల్లాన్ని భక్తులు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. ఆలయ ప్రాంగణం రామనామస్మరణతో మార్మోగింది.
క్లాత్ అండ్ రెడిమేడ్ అసోసియేషన్
ఆధ్వర్యంలో శోభాయాత్ర
బాలదుర్గా టాప్ ఇన్ టౌన్, క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ సహాయ సహకారాలతో శోభా యాత్ర జరిపారు. కళాకారులు కోలాటాలు, విభిన్న వేషధారణలతో ఆకట్టుకున్నారు. దేవస్థానం ఈఓ దామోదర్‌రావు దంపతులు స్వామివారి పల్లకీ సేవ చేశారు. స్వామివారికి మిథిలా స్టేడియంలో హారతి సమర్పించారు. భక్తుల దర్శనం అనంతరం తిరువీధి సేవ జరిపారు. ఆస్థాన మండపంలో దర్బార్ సేవ, ఆరాధన, నివేదన ఇచ్చి పవళింపు సేవ నిర్వహించారు. సోమవారం ఆస్థాన మండపంలో తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం నిర్వహించనున్నారు.
అలరించిన ఏరు ఉత్సవం
గోదావరి తీరంలో నిర్వహించిన ఏరు ఉత్సవం అలరించింది. సంప్రదాయ నృత్యాలతో కళాకారులు ఆహూతులను ఆకట్టుకున్నారు. వేడుకలకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్, పీఓ రాహుల్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరై కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ముక్కోటి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
భద్రాచలంలో సోమ, మంగళవారాల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి తీరంలో తొలిసారిగా షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం లక్ష లడ్డూలను తయారు చేయిస్తున్నారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, వైద్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఎస్పీ రోహత్‌రాజు పర్యవేక్షణలో 1100 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓఎస్డీ, ఏఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 150 మంది ఏఎస్సైలు, 400 మంది కానిస్టేబుళ్లు, 70 మంది మహిళా కానిస్టేబుళ్లు, 275 మంది హోంగార్డులు విధులు నిర్వర్తించనున్నారు.
నేడు తెప్పోత్సవం
శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు పవిత్ర గోదావరిలో సోమవారం తెప్పోత్సవం నిర్వహించనున్నారు. వేడుకలకు హంస వాహనాన్ని అలంకరించారు. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన తర్వాత 11 రోజు (ఏకాదశి)ని మధ్యగా చేసుకుని అటు పది రోజులు ఇటు పదిరోజులు మొత్తంగా 21 రోజులపాటు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్ర పద్ధతులను పాటిస్తూ ఏకాదశికి ముందు పగల్‌పత్తు, ఏకాదశి తర్వాత రాపత్తు ఉత్సవాలు జరుపుతారు. వేడుకల్లో పదో రోజు రామయ్య జల విహారం చేయనుండగా, ఆగమంలో దీన్ని ప్లవోత్సవంగా పేర్కొంటారు. వ్యవహారికంలో తెప్పోత్సవంగా పిలుస్తారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఏఎస్‌పీ విక్రాంత్ కుమార్ సింగ్, ట్రైనీ, డిప్యూటీ కలెక్టర్లు సౌరభ్ శర్మ, మురళి, కోటేష్, శ్రావణ్‌కుమార్, సర్పంచ్ పూనెం కృష్ణ పాల్గొన్నారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సేవాకాలం, తిరుమంగై ఆళ్వారుల పరమపదోత్సవం
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు రాజభోగం, శాత్తుమురై, పూర్ణ శరణాగతి సేవ, పగల్‌పత్తు సమాప్తి
మధ్యాహ్నం 3గంటలకు దర్బారుసేవ
సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు స్వామివారిని ఊరేగింపుగా గోదావరి నది వద్దకు చేర్చుతారు.
సాయంత్రం 5గంటల నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై తెప్పోత్సవం జరుపుతారు.
ముగ్ధమనోహరం.. శ్రీకృష్ణావతారం
ముగ్ధమనోహరం.. శ్రీకృష్ణావతారం


