మేడారం జాతరకు ఆర్టీసీ సిద్ధం
డిపోల వారీగా పాయింట్లు, కేటాయించిన బస్సులు
● ఖమ్మం రీజియన్ నుంచి 244 ప్రత్యేక బస్సులు ● కొత్తగూడెం డిపో నుంచి అత్యధికంగా కేటాయింపు ● జనవరి 25 నుంచి 31 వరకు సర్వీసుల నిర్వహణ
ఖమ్మంమయూరిసెంటర్: ఆసియా ఖండంలో నే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క – సారలమ్మ జాతర సమీపిస్తోంది. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే జాతరకు వెళ్లే భక్తుల కోసం బస్సులు నడిపించేలా టీజీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. గతఅనుభవాలను పరిగణన లోకి తీసుకోవడమేకాక భారీ సంఖ్యలో జాతరకు వెళ్లే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయా ణం అందించేలా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ప్రతీ ఆదివారం మేడారా నికి బస్సులునడిపిస్తుండగా, జాతర సమయా న ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు పూర్తిచేశారు.
ముందస్తు ప్రణాళిక
మేడారంలో సమ్మక్క – సారలమ్మ అమ్మవార్ల ను దర్శించుకునేందుకు పల్లె,పట్నంతేడా లేకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు. ఉమ్మడి జిల్లా నుంచి కూడా మేడారం జాతరకు వెళ్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 2024 నాటి జాతరలో ఉమ్మడి జిల్లా నుంచి 2,36,909 మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించారు. ఈసారి ఈ సంఖ్య మరింత పెరిగినా మెరుగైన సేవలందించేందు కు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆర్‌ఎం డిపో మేనేజర్లు, సూపర్‌వైజర్లతో పలుమార్లు సమీక్షలునిర్వహించగా.. తాజాగా శనివారం ఈడీ సోలోమన్ ఉమ్మడి జిల్లా అధి కారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
25 నుంచే జాతర బస్సులు
మేడారం జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే భక్తులు వెళ్లివస్తుండగా జనవరి 25 నుంచి ఈ సంఖ్య మరింత పెరగనుంది. దీంతో ఖమ్మం రీజి యన్‌లోని పది పాయింట్ల నుంచి 244 బస్సులు నడిపించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ బస్సులు జనవరి 25 ఆదివారం నుంచి 31వ తేదీ శనివారం వరకు కొనసాగుతాయి. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం పాయింట్ల నుంచి అధిక సంఖ్యలో బస్సులు నడపాలని నిర్ణయించారు. వీటితో పాటు పాల్వంచ, చర్ల, వెంకటాపూర్, మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం, ఖమ్మం జిల్లా కేంద్రాల్లోనూ బస్సు పాయింట్లు ఏర్పాటుచేస్తారు. ఉమ్మడి జిల్లాలోని డిపోల నుంచి సాధ్యమైనంత ఎక్కువ బస్సులను సద్వినియోగం చేసుకుంటూ రద్దీకి అనుగుణంగా నడపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి భక్తుల తాకిడి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం ఉండడంతో మహిళా భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు.
డిపో పాయింట్ బస్సులు
కొత్తగూడెం కొత్తగూడెం 110
కొత్తగూడెం ఇల్లెందు 41
భద్రాచలం భద్రాచలం 21
భద్రాచలం పాల్వంచ 15
సత్తుపల్లి ఏటూరునాగారం 17
సత్తుపల్లి చర్ల 03
సత్తుపల్లి వెంకటాపూర్ 06
మణుగూరు మణుగూరు 16
మణుగూరు మంగపేట 05
ఖమ్మం ఖమ్మం 10


