కనెక్షన్లు ౖపైపెకి..
● జిల్లాలో 56,789 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ● దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇస్తామంటున్న అధికారులు ● ఏడాదిలోనే 52 శాతం పెంపు
సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతుల సాగు భూములకు నీరందించేందుకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం.. సర్వీసుల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే కనెక్షన్ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం, ఎక్కువ ఏజెన్సీ ప్రాంతం ఉన్న జిల్లాలో 90 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలే ఉన్నాయి. ఇందులో ఎకరం, అంతకంటే తక్కువ భూములు ఉన్న గిరిజనులు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో రైతులు అడిగిన వెంటనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసేలా ఆ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు.
పారదర్శక సేవల కోసం..
జిల్లాలో వ్యవసాయ విద్యుత్ సర్వీసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023తో పోల్చితే 2024లో 52 శాతం కనెక్షన్లు పెరగడం విశేషం. ప్రస్తుతం 56,789 సర్వీసులు ఉన్నాయని విద్యుత్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. సర్వీసుల మంజూరుకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా సరిపడా మెటీరియల్‌ను అధికారులు సిద్ధంగా ఉంచుతున్నారు. అవసరమైన ప్రదేశాల్లో స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. రైతులు దరఖాస్తు చేసుకోగానే వాటిని ఆన్‌లైన్ చేస్తున్నారు. తద్వారా పారదర్శకంగా సేవలందించే అవకాశంతో పాటు రైతులు తమ దరఖాస్తుల స్టేటస్‌ను అగ్రికల్చర్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
పెండింగ్‌లో 637 దరఖాస్తులు..
2024 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు జిల్లాలో 4,963 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు. గతేడాది ఏప్రిల్‌లో 404, మే నెలలో 343, జూన్ 405, జూలై 370, ఆగస్టు 288, సెప్టెంబర్ 111, అక్టోబర్ 346, నవంబర్ 383, డిసెంబర్ 428, ఈ ఏడాది జనవరి 425, ఫిబ్రవరి 438, మార్చి 491, ఏప్రిల్‌లో 531 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా ఇంకా 637 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
సత్వర మంజూరుకు చర్యలు
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సత్వర మంజూరుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆన్‌లైన్ విధానంతో తమ దరఖాస్తులు ఎక్కడ పెండింగ్‌లో ఉన్నాయో రైతులు తెలుసుకునేలా అగ్రికల్చర్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నాం. కనెక్షన్లు పొందిన రైతులు సాగునీటి అవసరం మేరకే మోటార్లను వినియోగించాలి. ఎక్కువ సేపు మోటార్లు ఆన్ చేసి ఉంచితే విద్యుత్‌తో పాటు సాగునీరు వృథా అవుతాయి. మోటార్ల వినియోగంలో అధికారుల సూచనలను జాగ్రత్తలను పాటించాలి.
–జి.మహేందర్, విద్యుత్ ఎస్‌ఈ
కనెక్షన్లు ౖపైపెకి..


