వద్దన్నా వరి వేస్తే మేమేం చేస్తాం..
న్యూస్‌రీల్
విత్తు వేశాక వద్దంటే ఎలా?
ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026
వరికి నీరు ఇవ్వలేమని తెగేసి చెప్పిన ప్రజాప్రతినిధులు, అధికారులు
● ప్రత్యామ్నాయ పంటలు సాగు
చేయాలని ఉచిత సలహాలు
● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో
ప్రజాప్రతినిధులు, అధికారుల వైఖరి
● నాగార్జున సాగర్, కృష్ణా ఆయకట్టు
పరిధిలోని రైతుల ఆశలపై నీళ్లు
చల్లిన టీడీపీ ప్రభుత్వం
● విత్తు వేశాక సాగునీరు ఇవ్వబోమని
చెబితే రైతులు ఏమైపోవాలని
జెడ్పీటీసీ సభ్యుల ఆగ్రహం
● ముగిసిన చివరి సర్వసభ్య సమావేశం
● పలువురు టీడీపీ ఎంపీలు,
ఎమ్మెల్యేలు గైర్హాజరు
గుంటూరు ఎడ్యుకేషన్: రైతులెవ్వరూ వరి పంట వేయవద్దు... ప్రభుత్వం చెప్పినట్లు వినకుండా వరినాట్లు వేస్తే సాగునీరు అందించే బాధ్యత ప్రభుత్వానికి లేదని టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం తేల్చి చెప్పారు. వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో వరికి ప్రత్యామ్నాయంగా సాగునీటితో సంబంధం లేని పంటలు వేసుకోవాలని రైతులకు సలహా ఇచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగిన సమావేశంలో అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని జెడ్పీటీసీ సభ్యులు పేర్కొన్నారు. సమావేశంలో ప్రధానంగా సాగునీటిపై చర్చ జరిగింది. నాగార్జునసాగర్, కృష్ణానది ఆయకట్టు పరిధిలోని రైతాంగం 12 లక్షల ఎకరాల పంటలు సాగు చేస్తున్నారని అయితే కృష్ణానది నుంచి నీటిని విడుదల చేయకుంటే రైతుల పరిస్థితి ఏంటని అధికారులను సభ్యులు నిలదీశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగర్, కృష్ణానది ఆయకట్టు పరిధిలో వరి పంటకు సాగునీటిని ఇచ్చే పరిస్థితులు లేవని, చెరువులు నింపేందుకు, తాగునీటి అవసరాలకే నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరులు, వ్యవసాయశాఖాధికారులు చెప్పడం రైతాంగం ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జెడ్పీ సమావేశాల్లో సభ్యులు ఒక సమస్యపై పదే, పదే మాట్లాడుతున్నారంటే పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రస్తుత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యను వచ్చే సమావేశంలోపు పరిష్కరించాలని, ప్రతి వారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లుగా జెడ్పీలో సభ్యులు అడిగే ప్రశ్నలను నమోదు చేసుకుని, పరిష్కరించాలన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ చైర్‌పర్సన్‌గా తాను ఇద్దరు సీఎంల హయాంలో ఐదేళ్ల పాలన పూర్తి చేశానని అన్నారు. తనకు సహాయ, సహకారాలు అందించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదేళ్ల కాలంలో రూ.175 కోట్లతో 710 పనులు పూర్తి చేయడంతో పాటు 127 కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. రెండు ప్రభుత్వాల్లో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయింత్ వర్మ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరి పంటకు సాగునీటిని ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. వరికి అనుబంధంగా పప్పు దినుసులను సాగు చేయడం ద్వారా వరికి నీరు అందించలేని పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ఉంటారని, ప్రత్యామ్నాయ పంటల దిశగా ముందుకు వెళ్లాలని, వ్యవసాయ శాఖతో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.
● ప్రత్తిపాడు జెడ్పీటీసీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ గుంటూరు చానల్ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, మధ్యలో ఉన్న రైతులకు ఇవ్వకుండా చివరిగా ఉన్న వారికి చెల్లిస్తున్నారన్నారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు మాట్లాడుతూ రూ.38.43 కోట్లు నష్ట పరిహారంగా అందించామని, భూములు ఇచ్చిన రైతులందరికీ నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు.
● అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు మాట్లాడుతూ అమరావతిలో శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూములు వున్నాయని, వాటికి ఎన్‌ఓసీ ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడబెడుతున్నారని, దేవాలయ భూమి ఒక సెంటు పోయినా న్యాయ పోరాటం చేస్తామన్నారు.
● కో ఆప్షన్ సభ్యుడు హస్మీ మాట్లాడుతూ అమరావతి – సత్తెనపల్లి రహదారి అధ్వానంగా ఉందని, కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి కుడా లేదని సభలో ఫొటోలను ప్రదర్శించారు. జెడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్‌రావు మాట్లాడుతూ ఏసీబీ రైడ్‌లో అరెస్టయిన చిలకలూరిపేట ఎంఈఓకు తిరిగి అదే మండలంలో పోస్టింగ్ ఇచ్చారని, దీంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారన్నారు.
● గత ప్రభుత్వంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఎంతో ప్రాధాన్యతతో ప్రారంభించిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వకాలతో విద్యార్థులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారని పలువురు సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు. తమ పదవీ కాలం పూర్తవుతున్నా టూర్‌కు తీసుకెళతామని ఇచ్చిన హామీ నెరవేరలేదని జెడ్పీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరి జెడ్పీ సమావేశానికి బాపట్ల ఎంపీ ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. కేంద్రమంత్రి పెమ్మసాని, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కొత్తగా రాజ్యసభకు ఎన్నికై న భాష్యం రామకృష్ణ గైర్హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో కన్నా లక్ష్మీనారాయణ, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనందబాబు మినహా మిగిలిన వారు గైర్హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, గుంటూరు, నరసరావుపేట డీఆర్వోలు ఖాజావలి, అద్దయ్య పాల్గొన్నారు.
జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశానికి హాజరైన జెడ్పీటీసీ సభ్యులు,
ప్రజాప్రతినిధులు, అధికారులు
మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా, చిత్రంలో కలెక్టర్
వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వర్షాభావం దృష్ట్యా వరి పంట వేయవద్దని సీఎం చంద్రబాబు రైతాంగాన్ని హెచ్చరించారని, వద్దన్నా వరి పంట వేసిన రైతాంగం సాగునీరు ఇవ్వలేదని ప్రభుత్వంపై నింద మోపడం తగదన్నారు. వర్షాలు లేకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని, రైతులే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవమేనని, అయినా సాగునీటి కోసం రైతాంగం ఆందోళన చెందాల్సి అవసరం లేదన్నారు. వర్షాలు కురుస్తాయని, పంటలకు సాగునీరు వస్తుందన్నారు.
వైఎస్సార్ సీపీ రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్‌పై ఆధారపడి 5 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుకు దిగిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు? శ్రీశైలం, సాగర్‌కు ఎగువ నుంచి వస్తున్న నీటిని సాగునీటి అవసరాలకు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్న రైతాంగం గతేమి కావాలన్నారు. ఖరీఫ్‌కు ముందుగా రైతులను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం వరినాట్లు వేసిన తరువాత నీరు ఇవ్వబోమని చెబితే రైతులకు దిక్కెవరని, అన్నం పెట్టే రైతన్నలపై ఈ విధంగా కక్ష గట్టడం తగదన్నారు. గతంలో సాగర్ డెడ్ స్టోరేజీకి వెళ్లినప్పుడు సైతం సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. మంథా తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదని, ఉచిత పంటల బీమా లేకపోవడంతో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు.


