మూడు మండలాల్లో వర్షం | - | Sakshi
Sakshi News home page

మూడు మండలాల్లో వర్షం

Jul 21 2026 1:36 AM | Updated on Jul 21 2026 1:36 AM

మూడు మండలాల్లో వర్షం ఉరివేసుకుని యువకుడు బలవన్మరణం షెడ్డులో గుర్తుతెలియని మృతదేహం ఇరువర్గాల మధ్య ఘర్షణ మల్లేశ్వరస్వామి సేవలో ట్రైబ్యునల్‌ చైర్మన్‌

నరసరావుపేట: గడిచిన 24 గంటల్లో జిల్లాలోని 28 మండలాల్లో కేవలం మూడు మండలాల్లోనే వర్షం కురిసినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. వెల్దుర్తిలో 3.2 మిల్లీమీటర్లు, రెంటచింతలలో 3.8, ముప్పాళ్లలో 4.6మి.మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.

వినుకొండ: పట్టణ శివారు రజక కాలనీలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మర్రిపూడి సాయి (19) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి రమణ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోమవారం ఉదయం ఇద్దరూ పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నట్లు తెలిపారు. సాయి పట్టణంలోని ఓ వ్యాపార సంస్థలో కూలీగా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు సాయిని ఉరివేసుకున్న స్థితిలో గుర్తించి బోరున విలపించారు. ఈ ఘటనతో రజక కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు చదువుకుంటున్నాడని, రెండో కుమారుడైన సాయి అకారణంగా ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నాదెండ్ల: చిలకలూరిపేట నూతన వ్యవసాయ మార్కెట్‌ యార్డు పక్కనే షిరిడీ సాయి ఆలయం ఎదురుగా మృతదేహం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..16వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ షెడ్డులో సోమవారం రాత్రి స్థానికులు మృతదేహాన్ని గమనించారు. రూరల్‌ సీఐ బి.సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్‌ఐ ఆర్‌.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 50 ఏళ్ల వ్యక్తి వారం రోజుల కిందట షెడ్డులో మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు భిక్షాటన చేసే వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. మృతదేహం కుళ్లిపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. ఆనవాళ్లు గుర్తు పట్టలేని విధంగా మారిందని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

రెంటచింతల: మండల కేంద్రమైన రెంటచింతల గ్రామ సమీపంలో నున్న జాతీయ రహదారి వెంబడి ఉన్న రెస్టారెంట్‌ వద్ద సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోలి గ్రామానికి చెందిన ఉప్పిడి నాగేశ్వరరావు బంధువులకు గురజాల మండలం సమాధానపేటకు చెందిన నరసింహానాయక్‌కు గొట్టిముక్కల మేజర్‌ కాల్వలో వేసిన దొనే విషయంలో (సాగునీటికి సంబంధించిన) వివాదం ఉంది. ఈ నేపధ్యంలో స్థానిక రెస్టారెంట్‌ వద్ద నాగేశ్వరరావు టీ తాగుతున్న సమయంలో ఆక్కడకు వచ్చిన నరసింహా నాయక్‌ వర్గీయులకు నాగేశ్వరరావుకు, ఆయన కుమారుడు వెంకటేశ్వర్లుకు కాల్వ వ్యవహారంపై మాటమాట పెరిగింది. నరసింహా నాయక్‌ వర్గీయులు చేసిన దాడిలో నాగేశ్వరరావు ఆయన కుమారుడు వెంకటేశ్వర్లుకు గాయాలు కాగా వారిని వెంటనే గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో పూజలు చేసేందుకు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ఎండోమెంట్స్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌ ఎ.భారతి దంపతులు విచ్చేశారు. ఆలయ అధికారులు, పాలకమండలి చైర్మన్‌, అర్చకస్వాములు, వేదపండితులు వారికి సాదర స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి అభిషేక సేవలో దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి చిత్రపటం, ప్రసాదాలను పాలకమండలి చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు అందజేసినట్లు ఆలయ ఉపకమిషనరు గోగినేని లీలాకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement