రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, కుమారుడికి గాయాలు
మార్టూరు: మండలంలోని ద్రోణాదుల గ్రామంలో సోమవారం ఓ దళిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన జెండ్రాజుపల్లి ఏసోబు తన తల్లి విన్నెమ్మ (60)తో కలిసి ద్విచక్ర వాహనంపై అద్దంకి నుంచి స్వగ్రామం ద్రోణాదుల వస్తున్నాడు. జాతీయ రహదారిపై ముప్పవరం సమీపంలోకి రాగానే వీరి బైకును వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు వెన్నెమ్మ రహదారిపై పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా ఏసోబు తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మార్టూరు 108 సిబ్బంది గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విన్నెమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేణింగివరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కొల్లూరు: రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసిన సంఘటన కొల్లూరులో సోమవారం రాత్రి జరిగింది. అధికారుల కథనం మేరకు.. కొల్లూరుకు చెందిన సామా సత్యనారాయణ రేషన్ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారంతో పౌరసరఫరాల శాఖ సీఎస్‌డీటీ ఫణికుమార్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. సత్యనారాయణ ఇంటిలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ప్లాస్టిక్ గోతాల్లోకి మార్చి అక్రమ రవాణాకు సిద్ధం చేసి ఉంచడాన్ని గుర్తించారు. అక్రమంగా నిల్వ చేసిన 40 బస్తాల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తి సత్యనారాయణపై కేసు కేసు నమోదు చేశారు. తనిఖీలలో కొల్లూరు–3 వీఆర్‌ఓ నన్నెపాముల రాంబాబు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.
10 మందికి తీవ్ర గాయాలు
విజయపురిసౌత్: ిపచ్చి కుక్క దాడి చేయడంతో పదిమంది తీవ్రంగా గాయపడిన సంఘటన మాచర్ల మండలం విజయపురిసౌత్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే విజయపురిసౌత్ లోని దేశవరపు క్యాంపు తండాలో పలువురు వ్యక్తులు బయట ఉండగా పిచ్చి కుక్క వారిపై దాడి చేసింది. అక్కడున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సాగర్ మాత ఆలయం వద్ద ఉన్న ఉన్న ఆరుగురిని అదే పిచ్చికుక్క కరిచి గాయపరచింది. మొత్తం 10 మంది పిచ్చికుక్క దాడిలో గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ప్రాజెక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు.


