పెదకాకాని: విశ్వప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా నిర్వహించిన వీవీఐటియూ జగన్నాథ రథయాత్ర ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతూ వైభవంగా సాగింది. మండలంలోని నంబూరు వీవీఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ రథయాత్రను విద్యార్థులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవాలయం నుంచి గోళ్లమూడి గ్రామం మీదుగా వీవీఐటియూ వరకు ఈ యాత్రను వివా, వీవీఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు కొలువుదీరిన రథం ముందు సంప్రదాయ క్రతువు చేరాపహరాతో (బంగారు చీపురుతో శుభ్రపరిచి) ప్రారంభించారు. వేలాది మంది భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యుల భక్తిశ్రద్ధలతో, విదేశీ భక్తుల సంకీర్తనలు, జయ జయహే జై జగన్నాథ నినాదాలతో ఈ యాత్ర శోభాయమానంగా ముందుకు సాగింది. మార్గమధ్యలో విద్యార్థులు, అధ్యాపకుల కోలాట నృత్యాలు, గీతాలాపనలు అలరించాయి. వీవీఐటియూ అధ్యాపకేతర సభ్యుడు నంబూరు మణికుమార్ జగన్నాథుని వేషధారణలో ఆకట్టుకున్నాడు. ఈ కార్యక్రమంలో శివాలయం ఈవో గోగినేని లీలాకుమార్, వివా, వీవీఐటియూ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఇస్కాన్ మంగళగిరి ప్రతినిధులు, పెదకాకాని పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


