సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ
లక్ష్మీపురం: తాడికొండలోని బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలను మూసివేయటాన్ని, దీనిని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన విద్యార్థు తల్లిదండ్రులు, ఎస్.ఎఫ్.ఐ, కె.వి.పి.యస్ సంఘాల నాయకులపై పోలీసులు దౌర్జన్యంగా దాడిచేసి అరెస్టు చేయటాన్ని సీపీఎం జిల్లా కమిటీ ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా జిల్లాలోని పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురుకుల పాఠశాలను మూసివేయడం వల్ల దళిత, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందని అన్నారు. రాజధానిలో వేల ఎకరాల భూములను సేకరించి అనేక కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతున్నారని, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు కూడా అలాగే భూములు కేటాయించి నడపవచ్చని, ఏకపక్షంగా గురుకుల పాఠశాలను తరలించడం సరికాదన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నీట్, జేఈఈ కోచింగ్ ఇవ్వడానికి ప్రైవేటు వారిని ఆహ్వానించి వారికి కట్టబెట్టటాన్ని సీపీఎం వ్యతిరేకిస్తుందన్నారు. అమర్యాదగా, దౌర్జన్యంగా ప్రవర్తించిన సీఐపై చర్య తీసుకోవాలని, తాడికొండలో అంబేద్కర్ గురుకుల పాఠశాలను కొనసాగించటానికి ప్రభుత్వం పూనుకోవాలని, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అమరావతిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు, ఎన్.భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.


