చివరికి సాగు నీరేది? | - | Sakshi
Sakshi News home page

చివరికి సాగు నీరేది?

Jul 18 2026 3:23 AM | Updated on Jul 18 2026 3:23 AM

చివరికి సాగు నీరేది? కురవని వర్షాలు ● జూలై ముగుస్తున్నా కనిపించని చినుకు జాడ ● కృష్ణా పశ్చిమ డెల్టాకు 46 టీఎంసీలే కేటాయింపు ● ఖరీఫ్‌కు 90 టీఎంసీలు అవసరమని అంచనా ● జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 2,41,632 ఎకరాలు ● ఇప్పటి వరకు కేవలం 1,038 ఎకరాల్లోనే సాగు సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు బుధవారం ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. అయితే ఆ నీరు ఎన్ని ఎకరాల్లో సాగుకు సరిపోతుందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో అధికారికంగా ఖరీఫ్‌లో దాదాపు 2.42 లక్షల ఎకరాలలో వరి సాగు కావాల్సి ఉంది. చీరాల ప్రాంతంలో కొమ్మమూరు కాలువ చివరి ఆయకట్టు కలిపితే దాదాపు 3 లక్షల ఎకరాలకుపైగానే ఆయకట్టు ఉంది. జూలై నెల ఆఖరుకు వస్తున్నా ఇప్పటివరకు కేవలం 1,038 ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. అది కూడా వేమూరు నియోజకవర్గంలో వెద పద్ధతిలో వేశారు. మిగిలిన ప్రాంతంలో పొలాలన్నీ బీళ్లుగా ఉండిపోయాయి. వాస్తవానికి బాపట్ల డివిజన్‌ పరిధిలోని అమృతలూరు, బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, చుండూరు మండలాల పరిధిలో 40,594 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉంది. రేపల్లె డివిజన్‌ పరిధిలో భట్టిప్రోలు, చెరుకుపల్లి, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, రేపల్లె, వేమూరు మండలాల్లో 48 వేల హెక్టార్లు... చీరాల డివిజన్‌ పరిధిలో చినగంజాం, చీరాల, వేటపాలెం మండలాలలో 2,588 హెక్టార్లు... మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, యద్దనపూడి మండలాల్లో 6,603 హెక్టార్ల చొప్పున మొత్తం 97,785 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉంది. ఇప్పటివరకూ బాపట్ల డివిజన్‌ పరిధిలో 109, రేపల్లె డివిజన్‌ పరిధిలో 311 చొప్పున మొత్తం దాదాపు 420 హెక్టార్లలో మాత్రమే వరిపంట సాగైంది. ఇంకా మిగిలిన చోట్ల వరి పంట ఎప్పటికి సాగవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని వేమూరు నియోజకవర్గ రైతులు ఇప్పటికే వరి సాగు చేపట్టారు. ఎనభై శాతం మంది వెద పద్ధతిలో సాగు చేయగా, మిగిలిన వారు నారు మడులు పోశారు. బోర్లు, ట్యాంకర్ల ద్వారా నారుమడులకు నీటిని అందిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలైన కంది, మినుము, పెసర, జొన్న, అలసందలు, ఉలవలు, కొర్రలు సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో వరిసాగు ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రభుత్వం కూడా రైతులను ముందస్తుగా ఈ పరిస్థితులను వివరించి అప్రమత్తం చేయడంలో విఫలమైంది.

చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆందోళనలో రైతులు

వాస్తవానికి జూన్‌ నెలలో 71, జూలైలో 118.5, ఆగస్టులో 157.20, సెప్టెంబర్‌లో 157.80 చొప్పున మొత్తం 504.50 ఎంఎం వర్షపాతం కురవాల్సి ఉంది. జూన్‌తోపాటు జూలైలో ఇప్పటివరకూ నామమాత్రంగా కూడా వర్షపాతం నమోదు కాలేదు. రాబోయే రోజుల్లో కురవడం కూడా ఎల్‌నినో ప్రభావంతో అనుమానంగానే మారింది. ఈ సారి అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. జూలై నెలలోనూ వడగాలులు వీస్తున్నాయి. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. జలాశయాల్లో తగినంత నీటి నిల్వలు లేవు. ఎగువన వర్షాలు కురిస్తేనే జలాశయాలకు నీరు చేరుతుంది. వర్షాలు సక్రమంగా కురవకపోతే ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకమే అవుతుంది. తాగు నీటికి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.

కురవని వర్షాలు

నామమాత్రంగా సాగు

ప్రత్యామ్నాయ పంటలు మేలు

జిల్లాలో వరి సాగుకు దాదాపు 80 టీఎంసీలు అవసరం కాగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేవలం 46 టీఎంసీలే కేటాయించింది. దీంతో ఖరీఫ్‌లో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నీటితో సాధారణ విస్తీర్ణంలో సగం కూడా సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వానలు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనీసం వారిని అప్రమత్తం చేయడం, ప్రత్యామ్నాయ పంట ప్రణాళిక రూపకల్పనలో చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement