కర్లపాలెం: వినియోగదారుల హక్కుల పరిరక్షణ ముఖ్యమని, సంబంధిత చట్టాలపై అందరికీ అవగాహన అవసరం అని గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సయ్యద్ జియాఉద్దీన్ చెప్పారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జియాఉద్దీన్ మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు పారా లీగల్ వలంటీర్లను సంప్రదించాలని చెప్పారు. జనన, మరణ, వివాహ ధ్రువపత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. న్యాయవాదులు కట్టా కాళిదాసు, సీహెచ్ రామాంజనేయులు, శ్రీనివాసరావు, తహసీల్దార్ రవీంద్రకుమార్, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.


