చీరాల: అధికారులు, ప్రభుత్వం అలసత్వం కారణంగా విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌పై చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడి రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు నోటిఫికేషన్‌కు సంబంధించి ఎటువంటి సమాచారం రాకపోవడంతో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు నిరాశే మిగులుతోంది. రెండేళ్లుగా ఇదే గందరగోళాన్ని సృష్టిస్తోందనే విమర్శలు సర్కారుపై వినిపిస్తున్నాయి.
అంతా అయోమయం.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలో మొత్తం 88 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో డిగ్రీ మొదటి సంవత్సరం బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. నోటిఫికేషన్ వెలువడకుండా అడ్మిషన్లు తీసుకునే పరిస్థితి లేదు. చీరాలలో వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి మంచి పేరుంది. ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ నెలలో రాగా సప్లమెంటరీ ఫలితాలు కూడా జూన్ 18న విడుదలయ్యాయి. డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఇప్పటి వరకూ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. నోటిఫికేషన్ ఎప్పుడిస్తారు? ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారు? తరగతులు ఎప్పుడు మొదలవుతాయోనని విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు అడ్మిషన్‌లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సీట్ల సంఖ్య ఆధారంగా అడ్మిషన్లు ఫేజ్‌ల వారీగా భర్తీ చేస్తారు. విద్యార్థులు కాలేజీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకుని సిబ్బంది వెనక్కి పంపించి వేస్తున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియకు షెడ్యూలు కూడా ప్రకటించారు.
గతేడాది కూడా ఇదే తీరు..
ఈ ప్రక్రియ గత రెండేళ్లుగా ఆలస్యంగా సాగుతోంది. డిగ్రీ తరగతులు 2024–25 విద్యా సంవత్సరంలో ఆగస్టు నెలాఖరుకు ప్రారంభం కాగా, గత విద్యాసంవత్సరం కూడా ఇదే విధంగా జరిగింది. ఇప్పుడు కూడా జూలై నెల పూర్తి కావస్తున్నా నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఎంసెట్ చివరి కౌన్సెలింగ్ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తారేమోనని ప్రచారం నడుస్తోంది. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థినులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.


