తెనాలి: పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవాసమితి ఆధ్వర్యంలో మొవ్వా విజయలక్ష్మి స్మారక 5వ వార్షిక అవార్డు ప్రదానోత్సవం ఈనెల 19వ తేదీన జరగనుంది. స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరోజు ఉదయం 9 గంటలకు ఏర్పాటయే ప్రత్యేక సభలో గుంటూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఈ అవార్డును బహూకరిస్తారు. ఇదే వేదికపై గత మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.5 వేల చొప్పున దాదాపు రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకం, జ్ఞాపికను బహూకరిస్తారు. సంబంధిత ఆహ్వానపత్రికను శుక్రవారం కవిరాజు పార్కులోని వీజీకే భవన్‌లో సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు.
● అవార్డు ప్రదానోత్సవ సభలో తెనాలి ఆర్డీవో కె.శ్రీరమణి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఇన్‌ఛార్జి రెక్టార్, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ డీన్ ఫాకల్టీ ప్రొఫెసర్ ఆర్.శివరామప్రసాద్, తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, మానవత, తెనాలి చైర్మన్, ఏఎస్‌ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్‌చంద్ పాల్గొంటారని వివరించారు.
● సేవాసమితి పేరుతో 2018 నుంచి మొవ్వా విజయలక్ష్మి స్మారకార్థం పట్టణంలో పలు ప్రజోపయోగ శాశ్వత నిర్మాణ కార్యక్రమాలను చేపడుతున్నట్టు సత్యనారాయణ గుర్తుచేశారు.
● 2022లో ఆమె పేరుతో అవార్డును ప్రవేశపెట్టి, వివిధ రంగాల్లో ప్రముఖులకు బహూకరిస్తూ, విద్యార్థులకు విజయలక్ష్మి స్మారకోన్యాసం ఇప్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఐపీఎస్ అధికారిణి, సీఐడీ అడిషనల్ ఎస్పీ కేజీవీ సరిత, తెనాలి సబ్‌కలెక్టర్ గీతాంజలి శర్మ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గురిజాల రాధారాణి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపకు బహూకరించినట్టు వివరించారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో ప్రసాదం పూర్ణచంద్రరావు, ఎన్.హనుమారెడ్డి, ఎ.రామూర్తి, వి.శరత్, వెనిగళ్ల శివప్రసాద్, రామకృష్ణ పాల్గొన్నారు.
గుంటూరు రేంజ్ ఐజీ
సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బహూకరణ
10వ తరగతిలో 550కి పైగా
మార్కులు సాధించిన
విద్యార్థులకు రూ.3 లక్షల
నగదు ప్రోత్సాహకాలు


