● ఆగస్టు 1న రాష్ట్ర డీజీపీకి వినతి
పత్రం అందజేయటంతో ముగింపు
● వైఎస్సార్ సీపీ గుంటూరు
జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
మంగళగిరి రూరల్: తన ఇంటిపై జరిగిన దాడి కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31న తేదీన గుంటూరులోని తన నివాసం నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వరకు వినతి పాదయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. మండలంలోని ఆత్మకూరు పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. అంబటి మాట్లాడుతూ జనవరి 31న తన ఇంటిపై ఏకంగా ఏడు గంటలపాటు జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఒక్కరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఏప్రిల్ 16వ తేదీన ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టి జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదన్నారు. అందుకే డీజీపీ కార్యాలయానికి పాదయాత్ర చేసి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాజా గ్రామంలో 31వ తేదీ రాత్రి బస చేసి, ఆగష్టు ఒకటో తేదీన డీజీపీ కార్యాలయానికి చేరుకుంటామని అనంతరం డీజీపీకి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు వ్యవస్థ దాడి ఘటనపై స్పందించకపోవడం ఆందోళనకరమని, ప్రజలకు న్యాయం జరిగేలా ఒత్తిడి తీసుకురావడమే పాదయాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు), వైఎస్సార్ సీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, మంగళగిరి రూరల్ అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బురమ్రుక్కల వేణుగోపాల్‌రెడ్డి, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షుడు అమర నాగయ్య, దుగ్గిరాల రూరల్ మండల అధ్యక్షుడు శివగోపయ్య, పార్టీ పంచాయతీరాజ్ కార్యదర్శి ఫిరోజ్, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డేవిడ్‌రాజు, జిల్లా ఆక్టివిటీస్ కార్యదర్శి మల్లావరపు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.


