తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
వేజండ్ల(చేబ్రోలు): చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామ పరిధిలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువతికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. తెనాలి నుంచి గుంటూరు వెళ్తున్న రైలు నుంచి మధ్యాహ్న సమయంలో సుమారు 20 సం.ల వయస్సు కలిగిన యువతి జారిపడి పొలాల్లో పడిపోయింది. తలకు, ముఖానికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ట్రాక్టర్‌తో పొలం దున్ను తున్న రైతులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి వెళ్లిన సిబ్బందికి సంఘటనా ప్రాంతం నుంచి తీసుకురావటానికి ఇబ్బందులు పడ్డారు. సుమారు కి.మీ దూరం వరకు రైలు పట్టాలపై, రాళ్లలో నడుచుకుంటూ అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్ట్రెక్చర్‌పై 108 సిబ్బంది కోట ఉదయ్ కిరణ్, బి.యహోషవాలతో పాటు స్థానిక రైతులు అంబులెన్స్ వాహనం వరకు అతికష్టం మీద తీసుకువచ్చి అత్యవసర వైద్య సేవలు అందించి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమెను ఒడిశాకు చెందిన యువతిగా భావిస్తున్నారు. రైలు గేటు వద్ద ఉన్న సమయంలో పొరపాటున జారిపడి ఉంటుందా లేక ఎవరైన ఉద్దేశపూర్వకంగా కిందకు నెట్టి ఉంటరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


