‘భరోసా’ కరువు | - | Sakshi
Sakshi News home page

‘భరోసా’ కరువు

Jul 15 2026 1:52 AM | Updated on Jul 15 2026 1:52 AM

చంద్రబాబు సర్కారు తీరుతో చేనేత కార్మికులకు నష్టం రెండేళ్లయినా ఎన్నికల హామీల అమల్లో అంతులేని నిర్లక్ష్యం

మార్గదర్శకాలు రాలేదు

మోసం చేశారు

ప్రయోజనం శూన్యం

ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు నేతన్నలను నట్టేట ముంచింది. సంక్షేమ పథకాలకు కోతలు పెడుతూ ఆ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పండుగలా సాగిన నేతన్నల బతుకుల్లో కూటమి సర్కారు చీకట్లు నింపిందని చేనేత కార్మికులు వాపోతున్నారు.

చీరాల అర్బన్‌: చంద్రబాబు మాటలతో మభ్యపెడుతూ, చేతల్లో గారడీ చేస్తూ చేనేత రంగాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు, సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘నేతన్న నేస్తం’ కింద జిల్లాలో ఏకంగా 8,705 మందికి లబ్ధి చేకూర్చారని, ఏటా రూ.24 వేలు చొప్పున క్రమం తప్పకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేసి ఆదుకున్నారని గుర్తు చేస్తున్నారు. కానీ, చంద్రబాబు ‘నేతన్న భరోసా’ పేరుతో ఏటా రూ.25 వేలు ఇస్తానన్న హామీని గాలికి వదిలేశారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్యుత్‌ కింద జిల్లాలో 6,318 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చి చేతులు దులుపుకొంది. అర్హులకు కోతలు విధించి లబ్ధిదారుల సంఖ్యను దారుణంగా తగ్గించడంపై నేతన్నలు వాపోతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి నిలువునా మోసపోయామని బావురుమంటున్నారు.

50 ఏళ్లకే పెన్షన్‌ ఏమైంది?

చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల వేళ ఆర్భాటంగా హామీ ఇచ్చారు. ఆ కల్లబొల్లి మాటలు నమ్మిన నేతన్నలు ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. ఇంతవరకు ఒక్కరికి కూడా పెన్షన్‌ మంజూరు చేయలేదు.

అటకెక్కిన రిజర్వేషన్లు

ఒకవైపు జీఎస్టీ భారం చేనేత రంగానికి గుదిబండగా మారగా, మరోవైపు నేతన్నలకు అండగా నిలవాల్సిన 11 రకాల చేనేత రిజర్వేషన్ల చట్టాన్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. అధికారుల ఉదాసీనతతో నేతన్నలకు పని భద్రత ప్రశ్నార్థకమైంది.

పవర్‌లూమ్‌ మాయాజాలం

పెరిగిన నూలు, రంగులు, రసాయనాల ధరలతో చేనేత వస్త్రాల తయారీ, విక్రయాలు భారంగా మారాయి. ఈ కష్టకాలంలో పవర్‌లూమ్‌ వస్త్రాలు చేనేత వస్త్రాలుగా మార్కెట్లో యథేచ్ఛగా చెలామణి అవుతున్నాయి. వాడేకొద్దీ వాటి అసలు రంగు బయటపడుతున్నా.. అప్పటికే చేనేత రంగానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అక్రమార్కులను నియంత్రించాల్సిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించిన కార్యాలయం తిరుపతిలో ఉంది. అక్కడి నుంచి అధికారులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. స్థానిక అధికారులు, చేనేత సంఘాల ప్రతినిధులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతున్నారు.

అధికారులుగా మా వంతు బాధ్యతలు మేం నిర్వహిస్తున్నాం. కానీ, ‘నేతన్న భరోసా’ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మాకు ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. బహుశా ఆగస్టులో వచ్చే జాతీయ చేనేత దినోత్సవం నాటికి ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఇక చేనేత ముసుగులో కొన్నిచోట్ల పవర్‌లూమ్‌ వస్త్రాలు చెలామణి అవుతున్న మాట వాస్తవమే. మా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ తిరుపతిలో ఉంటుంది. ఎవరైనా ఫిర్యాదులు చేసినప్పుడు మాత్రమే వారు వస్తుంటారు.

– వెంకటేశ్వరరావు,

హ్యాండ్లూమ్స్‌ ఏడీ, చీరాల

50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తారని చెప్పడంతో ఎంతో ఆశపడి కూటమికి ఓట్లు వేశాం. ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు. ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా.. ఎవరిని అడిగినా దాటవేస్తున్నారు. ఎదురుచూసి కళ్లు కాయలు కాస్తున్నాయి.

– అంజయ్య,

చేనేత కార్మికుడు, ఈపూరుపాలెం

50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామంటే నిజమేనని నమ్మి ఓట్లు వేశాం. కానీ, ఇప్పుడు ఎదురుచూపులు తప్ప మాకు ఒరిగిందేమీ లేదు. అధికారులను, నేతలను అడిగితే సమాధానం లేదు.

– వెంకటేశ్వరమ్మ,

చేనేత కార్మికురాలు, దేవాంగపురి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement