బాపట్ల: ప్రతి చిన్నారికి సమాన విద్య అవకాశాలు కల్పించేలా భవిత కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో ఉన్న సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆటిజం సహాయక కేంద్రాలు, సాహిత విద్య కార్యక్రమాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవిత కేంద్రాల బలోపేతానికి చర్యలు – సమగ్ర విద్యతో ప్రతి చిన్నారికి విద్యాబుద్ధులు నేర్పడమే లక్ష్యమని తెలిపారు. బాపట్లలో ప్రత్యేక సీఎస్ కోన శశిధర్ ప్రతిపాదనల మేరకు ఆటిజం సహాయక కేంద్రం ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 17 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. తగిన వసతులు కల్పించినట్లు చెప్పారు. డీఈఓ శ్రీనివాస్ సింగ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, డీసీహెచ్ ఎస్. డాక్టర్ పద్మావతి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి మాధవి, డీఆర్‌డీఏ పీడీ సింగయ్య తదితరులు పాల్గొన్నారు.
‘సర్’లో 99.7 శాతం డిజిటలైజేషన్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలో సర్ కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. మంగళవారం తుది గడువుగా ప్రకటించిన అధికారులు ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ పూర్తి కాకపోవడంతో గడువు పెంచారు. మంగళవారం నాటికి 99.7 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. జిల్లాలో 10,50,605 మంది ఓటర్లు ఉన్నారు. వేటపాలెం, చీరాల అర్బన్, చీరాల రూరల్, భట్టిప్రోలు, బాపట్ల అర్బన్, బాపట్ల రూరల్, ఇంకొల్లు, కారంచేడు మండలాల పరిధిలో మరో 5 వేల ఫారాలు డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది.


