బాపట్ల: పీజీఆర్‌ఎస్‌లో అర్జీదారులు అందజేసే ప్రతి అర్జీకి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలకు సంబంధించి 142 మంది అర్జీలు వచ్చాయి. వెంటనే పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, డీఆర్‌ఓ జి. గంగాధర్ గౌడ్, ఎస్‌డీసీ లవన్న తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీ అమలు కాలేదు
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకాలో కూడా ఎస్సీ భూమి కొనుగోలు రుణమాఫీ పథకం అమలు జరగలేదని దళిత నాయకులు మాచవరపు జూలియన్, నీలం నాగేంద్రరావులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం రుణమాఫీ చేసిన 311.79 ఎకరాల భూమిని 554 మంది లబ్ధిదారులకు 22ఏ నుంచి తొలగించి పాస్‌పుస్తకాలు ఇవ్వాలని కోరారు.
స్థలం అడిగితే శ్మశానంలో ఇచ్చారు
కుమారుడి ఆరోగ్యం కోసం చికిత్స చేయించుకునేందుకు ఇంటిని సైతం అమ్ముకున్నామని, ముఖ్యమంత్రికి గ్రీవెన్స్‌లో అర్జీ ఇస్తే అధికారులు శ్మశానంలో స్థలం ఇచ్చారని ఓ కన్నతల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన కప్పల వెంకట సుజాత కుమారుడు యశ్వంత్ దివ్యాంగుడు. అతనికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో వైద్య ఖర్చుల కోసం ఇంటిని అమ్ముకుని అద్దె ఇంట్లో కాలం గడుపుతున్నారు. విచారణ చేసి మరోచోట స్థలం ఇస్తామని కలెక్టర్ చెప్పారు.
పొలంలోనే హద్దురాళ్లు
చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెంకు చెందిన జి. గోవిందరాజు తన పొలంలో హద్దురాళ్లు వేశారని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. పక్క పొలాలకు కొలతలు వేస్తున్నామని చెప్పి పిలిచి తనతో సంతకం చేయించుకుని, తన పొలంలోనే హద్దురాళ్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పొలం ఆక్రమణను అడ్డుకోండి
తన పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని, ఆరు నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ పని కావడం లేదని బత్తులవారిపాలెంకు చెందిన చిమటా మార్పు ఆవేదన వ్యక్తం చేశారు. 1.48 ఎకరాల పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని, ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు.
ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఫిర్యాదు
మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో టీడీపీ నాయకులు ఆక్రమించుకున్న సుమారు రూ.6 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ మార్టూరుకు చెందిన దళిత నాయకుడు సోమవారం బాపట్ల గ్రీవెన్స్ సెల్‌లో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అర్జీదారు రామకూరి విజయకుమార్ వివరాల మేరకు.. మార్టూరు నుంచి రాజుగారి పాలెం వెళ్లే మార్గంలో గల సర్వే నంబర్లు 392, 343లలో 2.08 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసి టీడీపీ నాయకుడు, మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు.


