లెక్కలన్నీ గోల్‌మాల్
నేటితో ముగియనున్న ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇప్పటికే జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాలు నూరు శాతం పంపిణీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. డిజిటలైజేషన్ కోసం అప్‌లోడింగ్ ఎంత శాతం జరుగుతుందో చూడాల్సి ఉంది. చాలాచోట్ల బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే ఎన్యూమరేషన్ ఫారాలు తెప్పించుకొని పనికానిచ్చారు. పర్చూరు, రేపల్లె లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ కార్యాలయాల్లోనే ఈఎఫ్‌ల ప్రక్రియ జరిగిందని, మిగిలిన నియోజకవర్గాల్లో చాలావరకు అధికారులు కార్యాలయాల్లోనే కూర్చొని తంతు నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. చాలామంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందని పరిస్థితి కనిపించింది. ఒకవర్గం ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఈ ప్రక్రియ సాగినట్లు ఆరోపణలున్నాయి.
బృందాలు ఏర్పాటు
చాలామంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించకుండానే తాము నూరుశాతం ఫారాలు అందజేసినట్లు కాకిలెక్కలు చూపించారు. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడడంతో జిల్లా కలెక్టర్ అప్రమత్తం అయ్యారు. క్షేత్రస్థాయి అధికారులకు చీవాట్లు పెట్టారు. జిల్లాలోని ఉన్నతాధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటింపజేసి పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు అప్రమత్తమై బీఎల్‌ఓలపై ఒత్తిడి తీసుకొచ్చారు. వారు స్పందించని చోట ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో కొంతమేర అక్రమాలకు అడ్డుకట్ట పడింది. తర్వాత అందరికీ ఫారాలు అందించారు. ప్రతి ఓటరుకూ రెండు ఫారాలు ఇచ్చి వివరాలు నింపిన తర్వాత ఒకటి బీఎల్‌ఓకి ఇవ్వాలి. మరో ఫారాన్ని ఓటర్‌కు అక్నాలడ్జ్‌మెంట్ కింద జాగ్రత్తగా దాచి పెట్టాలి. కానీ చాలాచోట్ల బీఎల్‌ఓలు ఒక్క ఎన్యూమరేషన్ పారాన్ని మాత్రమే ఓటర్‌కు ఇస్తున్నారు. రెండవ ఫారం అడిగితే ఫొటో తీసుకోమంటున్నారు. అడగకపోతే దాని గురించి పట్టించుకోవడం లేదు. ఓటు గల్లంతైతే ఫారం నింపి ఇచ్చినట్లు తమ వద్ద ఆధారం లేదని పలువురు ఓటర్లు వాపోతున్నారు. మృతులు, డబుల్‌ఎంట్రీ, షిప్టింగ్ ఓట్లను తుది రోజు నాటికి తొలగించనున్నారు. ఈ సాకుతో అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి అర్హుల ఓట్లను కూడా తొలగిస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్యూమరేషన్ ఫారాలు తమకు అందలేదని పలువురు ఓటర్లు ఫిర్యాదులు చేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరింది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు పావులు కదిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొందరు బీఎల్‌ఓలు, ఇతర సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి ఎంపిక చేసుకున్న ఓట్లను తొలగించేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది వ్యవహారం నడిపించే ప్రయత్నం చేశారు. పర్చూరు, చీరాల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఈ తరహా అక్రమాలకు యత్నించినట్లు సమాచారం.


