ఎన్‌పీటీఈఎల్‌ సర్టిఫికేషన్‌ కోర్సుల్లో విజ్ఞాన్‌ నిరులకు ఏ గ్రేడ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్‌పీటీఈఎల్‌ సర్టిఫికేషన్‌ కోర్సుల్లో విజ్ఞాన్‌ నిరులకు ఏ గ్రేడ్‌

Jul 14 2026 1:36 AM | Updated on Jul 14 2026 1:36 AM

గుంటూరు రూరల్‌: విజ్ఞాన్‌ నిరుల మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.రాధిక తెలిపారు. సోమవారం పెదపలకలూరు రోడ్డులోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ స్వయం ఎన్‌పీటీఈఎల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జనవరి–ఏప్రిల్‌ 2026 ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సుల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు కళాశాలకు ఏ రేటింగ్‌ లభించిందన్నారు. ప్రతిష్టాత్మక అవార్డును 2026 జూలై 11న చైన్నెలోని ఐఐటీ మద్రాస్‌లో నిర్వహించిన అవార్డుల పంపిణీ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్‌ ఎస్‌.లక్ష్మీశిరీష అందుకున్నారన్నారు. జనవరి–ఏప్రిల్‌ 2026 సెమిస్టర్‌లో కళాశాల నుంచి మొత్తం 923 మంది ఎన్‌పీటీఈఎల్‌ కోర్సులకు నమోదు చేసుకోగా, వారిలో 238 మంది విద్యార్థులు, 11 మంది అధ్యాపకులు కలిపి మొత్తం 249 మంది సర్టిఫికెట్లు సాధించారన్నారు. 19 మంది విద్యార్థులు టాపర్స్‌గా నిలిచి కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. జాతీయ స్థాయిలో కళాశాలకు లభించిన ఈ గుర్తింపు విద్యార్థులు, అధ్యాపకుల నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనమన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ఎస్‌. లక్ష్మిశిరీషను, అధ్యాపకులను, విద్యార్థులను, విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు అభినందించారు.

ఆర్‌వీఆర్‌ జేసీకి జాతీయ స్థాయిలో

14వ సారి ఏఏ రేటింగ్‌.. 98 స్టార్‌ అవార్డులు లభ్యం

గుంటూరు రూరల్‌: ఎన్‌పీటీఈఎల్‌ పరీక్షా ఫలితాల్లో తమ కళాశాల మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి వరుసగా 14వ సారి ప్రతిష్టాత్మక ఏఏ రేటింగ్‌ను సాధించటంతో పాటూ 98 స్టార్‌ అవార్డులు అందుకోవడం, దేశ వ్యాప్తంగా వున్న ఎన్‌పీటీఈఎల్‌ అన్ని లోకల్‌ చాఫ్టర్స్‌లో తమ కళాశాల అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని ఆర్‌వీఆర్‌ జేసీ ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు జె మురళీమోహన్‌, డాక్టర్‌ జగదీష్‌లు తెలిపారు. సోమవారం చౌడవరం గ్రామంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థుల ఈ అద్భుత విజయాలు కళాశాలలో అందిస్తున్న నాణ్యమైన సాంకేతిక విద్య, ఆధునిక బోధనా విధానాలకు నిదర్శనమన్నారు. ప్రతిష్ఠాత్మక గుర్తింపులో భాగంగా,కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి 259 గోల్డ్‌, 672 సిల్వర్‌, 1,034 ఎలైట్‌ గ్రేడ్‌లను సాధించారన్నారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 84 మంది విద్యార్థులు టాపర్‌ సర్టిఫికెట్లు పొందారన్నారు. ఇటీవల చైన్నెలోని ఐఐటీ మద్రాస్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో కళాశాల లోకల్‌ చాప్టర్‌ సమన్వయకర్త డాక్టర్‌ ఎంవీపీ చంద్రశేఖరరావు కళాశాల తరఫున ఈ ప్రతిష్టాత్మక అవార్డులను స్వీకరించారన్నారు. ఎన్‌పీటీఈఎల్‌ కోర్సులు ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే అత్యుత్తమ వేదికగా నిలుస్తున్నాయని, స్టార్‌ గుర్తింపు పొందిన విద్యార్థులకు ఐఐటీలలో నెలకు రూ.15,000 స్టైపెండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు, అత్యాధునిక సాంకేతిక అంశాలపై హ్యాండ్స్‌ఆన్‌ వర్క్‌షాప్‌లు, అలాగే ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ప్లేస్‌మెంట్‌ అవకాశాలను మెరుగుపరచుకునే ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్‌ ఆర్‌ గోపాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె శ్రీనివాస్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్వీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement