ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్ల: అర్జీల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారవేదిక(పీజీఆర్‌ఎస్)కు వచ్చిన అర్జీలను ఆయన స్వయంగా పరిశీలించారు. అర్జీదారులతో మాట్లాడి సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా భార్యాభర్తల వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మోసాలు, భూ వివాదాలకు సంబంధించిన అర్జీలు అందాయి. వాటిని ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరిధిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. బాధితుల అర్జీలను పరిష్కరించే సమయంలో వారి సమస్యను మన సమస్యగా భావించి చట్టపరిధిలో విచారణ చేపట్టి, వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. అర్జీల పరిష్కారానికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్ విభాగంకు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పీజీఆర్‌ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


