రేపల్లె డిపోలో అద్దె బస్సుల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

రేపల్లె డిపోలో అద్దె బస్సుల బంద్‌

Jul 14 2026 1:36 AM | Updated on Jul 14 2026 1:36 AM

రేపల్లె: హైర్‌ బస్సు డ్రైవర్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి, మదర్‌థెరిసా హైర్‌ బస్‌ డ్రైవర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు మణిలాల్‌ కోరారు. జీతాల పెంపుతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర కార్మిక హక్కులను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రేపల్లె ఆర్టీసీ డిపో పరిధిలోని హైర్‌(అద్దె) బస్సు డ్రైవర్లు సోమవారం తెల్లవారుజామున ఆందోళన చేశారు. ఉదయం 5 గంటల నుంచి అద్దె బస్సులను డిపోలోనే నిలిపివేసి విధులకు హాజరుకాక నిరసన చేపట్టారు. మణిలాల్‌ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని చీరాల, బాపట్ల, రేపల్లె డిపోల పరిధిలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లకు రెండేళ్లుగా వేతనాలు పెరగలేదని చెప్పారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో డ్రైవర్లకు తక్షణమే వేతనాల పెంపు అవసరమని తెలిపారు. అద్దె బస్సు యజమానులకు ముందుగానే సమస్యలను తెలియజేసి, పరిష్కారం లభించకపోతే ఆందోళన చేపడతామని సమాచారం ఇచ్చినప్పటికీ స్పందన రాకపోవడంతో బస్సులు నిలిపివేసి నిరసనకు దిగినట్లు చెప్పారు.

స్పందించిన యాజమాన్యం వేతనాల పెంపుపై సానుకూల హామీ ఇవ్వటంతో ఆందోళనను విరమించి విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో మదర్‌ థెరిసా హైర్‌ బస్‌ డ్రైవర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రేపల్లె డిపో అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, కన్వీనర్‌ కె.గోపి, కోశాధికారి జి.రవిబాబు, డ్రైవర్లు సుబ్రహ్మణ్యం, రాజు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement