చెరుకుపల్లి: భార్యాభర్తలు గొడవలో భార్య మృతి చెందింది. ఈ ఘటన కనగాలలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ కందుల తిరుపతిరావు అందించిన వివరాలు... రాంబొట్లపాలెం గ్రామానికి చెందిన పిట్టు శ్రీనివాసరెడ్డికి కర్లపాలేనికి చెందిన సుజాత(38)తో 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరు ప్రస్తుతం మండలంలోని కనగాలలో వారి బంధువుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరెడ్డి తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. పనుల నిమిత్తం రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి వచ్చాడు. కుమారుడు యేగేంద్రరెడ్డి బాపట్ల మేనత్త దగ్గర ఉండి పదో తరగతి చదువుతున్నాడు. కుమారుడిని పంపించి రావాలని సుజాత భర్తను కోరింది. తరువాత తీసుకెళ్తాలే అని శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పటంతో వివాదం పెరిగింది. వాదులాట సమయంలో సుజాతకు బలమైన దెబ్బ తగలటంతో చుట్టు పక్కల వారు దగ్గరలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే సుజాత మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి ఘటనా స్థలాన్ని సీఐ సురేష్ బాబు, ఎస్‌ఐ కందుల తిరుపతిరావు పరిశీలించారు. మృతురాలి తండ్రి అక్కల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


