రేపల్లె: న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కోర్టు హాలులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలలో మొత్తం 1225 కేసులు పరిష్కరించినట్లు తెనాలి సీనియర్ సివిల్ జడ్జి ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిష్కరించిన కేసుల్లో 29 సివిల్, 1196 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా వేగవంతంగా పరస్పర సమ్మతితో వివాదాలు పరిష్కారం కావడం వల్ల ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు. తెనాలి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన భక్తులు శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన రాయపాటి కోటి సుధాకర్ (సుబ్బారావు) ఆలయ అధికారులను కలిసి అన్నదానానికి రూ. 1,08,616 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ డీఈఓ కిశోర్‌కుమార్, అర్చకుడు రంగావఝుల శ్రీనివాసశాస్త్రి దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
తెనాలి: కొల్లిపర మండల గ్రామం కుంచవరంలోని శ్రీవారాహి దేవాలయంలో ఈనెల 15 నుంచి 24వ తేదీవరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, దీక్షాధారణ ఉత్సవాలు జరగనున్నాయి. ఈమేరకు ఉత్సవాల ఆహ్వానపత్రికను శనివారం స్థానిక మారీసుపేటలోని పోస్టల్ సహకార సొసైటీ భవనంలో శ్రీకాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ గౌరవ చైర్మన్ డీఎల్ కాంతారావు ఆవిష్కరించారు. ఆలయ ధర్మకర్త, ‘పోస్ట్’ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ తన్నీరు శ్రీనివాసబాబు మాట్లాడుతూ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి చేతుల మీదుగా ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు, హోమాలు, కుంకుమ పూజలు, మధ్యాహ్నం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, కల్యాణం శ్రీనివాసరావు, పీఎస్సార్ బ్రహ్మాచార్యులు, జగదీష్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయవాదులుగా రాణించాలంటే భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవడం కీలకమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ చీమలపాటి రవి అన్నారు. శనివారం జేకేసీ కళాశాల రోడ్డులోని జాగర్లమూడి చంద్రమౌళి (జేసీ) న్యాయ కళాశాల గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇరువురు న్యాయమూర్తులు న్యాయ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల పాలకమండలి అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కార్యదర్శి కుప్పుస్వామి, ఉపాధ్యక్షుడు డాక్టర్ కొండబోలు కృష్ణ ప్రసాద్, కోశాధికారి రాయపాటి వెంకట కోటేశ్వర ప్రసాద్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ పి.గోపీచంద్, ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ సుధాకర్ బాబు, పాలక మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


