● నిందితుడు రఫీ అరెస్టు
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ
వేటపాలెం: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు. చీరాల డీఎస్పీ ఎస్‌డీ మొయిన్ తన కార్యాలయంలో హత్యకు సంబంధించిన వివరాలను శనివారం వెల్లడించారు. దేశాయిపేట పంచాయతీ ముస్లిం కప్పల దొడ్డి కాలనీలో అన్నపురెడ్డి వీరమ్మ అలియాస్ షేక్ ఆశా భర్త షేక్ రఫీ నివాసం ఉంటున్నారు. వీరద్దరూ 13 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరమ్మకు ఇది రెండో వివాహం. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరమ్మ ఇంట్లో అగరబత్తీలు తయారు చేస్తుంటుంది. రఫీ ఆటో నడుపుతూ, మాంసం కొట్లో పనిచేస్తుంటాడు. కాగా రఫీ తరచూ మద్యం తాగి వచ్చి భార్యను అనుమానించి వివాహేతర సంబంధాలు అంటకడుతూ కొడుతూ ఉండేవాడు. రెండు నెలల క్రితం వీరమ్మ మొదటి భర్త ద్వారా పుట్టిన కూతురు అన్నపురెడ్డి ఉమా వెంకట లక్ష్మి తన నాయనమ్మ ఇంటి నుంచి తల్లి ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. కూతురిని హాస్టల్లో ఉంచి చదివిద్దామని భర్తతో చెప్పగా, అందుకు రఫీ అంగీకరించలేదు. ఈ విషయంపై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇటీవల భార్యను బాత్‌రూమ్‌లో ఉంచి కొట్టి, కూరగాయల కత్తితో చేతి మీద ఇష్టం వచ్చినట్లు దాడిచేశాడు. గురువారం తెల్లవారు జామున మళ్లీ భార్యతో గొడవ పడి ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్ చార్జింగ్ వైరు వీరమ్మ మెడకు బిగించి గట్టిగా లాగడంతో మృతి చెందింది. గమనించిన కూతురు ఉమా వెంకటలక్ష్మి వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శనివారం నిందితుడు రఫీ సంతరావూరు రైల్వే గేటు వద్ద ఉన్న కోళ్ల ఫారం దగ్గర ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. తాను చేసిన నేరాన్ని నిందితుడు ఒప్పుకున్నాడు. సెల్‌ఫోన్ చార్జింగ్ వైర్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పర్చినట్లు డీఎస్పీ వెల్లడించారు. రూరల్ సీఐ సుధాకర్ యాదవ్, ఎస్సై జనార్దన్ సమావేశంలో ఉన్నారు.


