పల్లపట్ల ముద్దుబిడ్డ ఎస్‌.జానకి | - | Sakshi
Sakshi News home page

పల్లపట్ల ముద్దుబిడ్డ ఎస్‌.జానకి

Jul 12 2026 3:23 AM | Updated on Jul 12 2026 3:23 AM

తీరప్రాంతానికి గర్వకారణమైన

మహాగాయని

పుట్టిన ఊర్లో విషాదఛాయలు

రేపల్లె: తీరప్రాంతంలోని చిన్న గ్రామమైన పల్లపట్లకు అపారమైన గుర్తింపు తీసుకువచ్చిన గానకోకిల ఎస్‌.జానకి (శిష్టా శ్రీరామమూర్తి జానకి) శనివారం కన్నుమూయడంతో ఆ ప్రాంతలో విషాదఛాయలు అలముకున్నాయి. తమ ఊరిలో పుట్టిన గాయనిగా గర్వంగా చెప్పుకునే గ్రామస్తులు ఆమె మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిజాంపట్నం మండలం పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్‌ 23న జన్మించిన జానకి చిన్నతనంలోనే తండ్రి ఉద్యోగరీత్యా కరీంనగర్‌కు వెళ్లిపోయారు. తండ్రి శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడిగా సేవలందించగా తల్లి శకుంతలమ్మ. చిన్న వయసులోనే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టినప్పటికీ ఆమె పుట్టిన నేలగా పల్లపట్లకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. గ్రామంలో పెద్దలు, వృద్ధులు ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గర్వపడేవారు. ఆమె ఈ ప్రాంతంలో ఎక్కువకాలం నివసించకపోయినా పుట్టిన ఊరుగా పల్లపట్లకు వచ్చిన గౌరవం మాత్రం తగ్గలేదు. గ్రామస్తులు తమ ఊరి పేరును దేశవ్యాప్తంగా వినిపించిన మహాగాయని అంటూ ఆమెను స్మరించుకుంటున్నారు. తీరప్రాంతంలోని ప్రజలు కూడా ఆమె మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఈ నేలలో పుట్టిన గానకోకిలగా జానకిని స్మరించుకుంటున్నారు. చిన్న గ్రామం నుంచి ప్రపంచ సంగీత శిఖరాలకు ఎదిగిన ఆమె ప్రయాణం ఈ ప్రాంతానికి ఎప్పటికీ గర్వకారణంగా నిలిచిపోతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆమె గానం చిరస్థాయిగా మారినప్పటికీ ఆమె లేని లోటు మాత్రం ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement