సమస్యల పరిష్కారం కోసం భారీ ధర్నా
బాపట్ల: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం దేశవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీ ధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె. ఝాన్సీ నేతృత్వం వహించారు. వేలాదిగా హాజరైన కార్యకర్తలతో కలెక్టరేట్ ముఖద్వారం కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి వచ్చిన వారు కలెక్టరేట్లోకి వెళ్లకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. బాబురావు మాట్లాడుతూ కనీసం కార్మికులుగా కూడా కార్యకర్తలను గుర్తించకపోవడం దారుణమని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం వేతనాలు పెంచాలన్నారు.
హామీ విస్మరించిన ఎమ్మెల్యే
కౌలు రైతు సంఘం జిల్లా నాయకుడు సీహెచ్ గంగయ్య మాట్లాడుతూ గతంలో సమ్మె సందర్భంలో ప్రస్తుత బాపట్ల శాసనసభ్యుడు వేగేశన నరేంద్ర వర్మ శిబిరానికి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి సమస్యలు తక్షణమే తీరుస్తామని ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నెరవేర్చకపోవడం దారుణమన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో అంగన్‌వాడీలు ధర్నా చేస్తుంటే ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కనీసం స్పందించక పోవడం శోచనీయమన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. రేఖా ఎలిజబెత్ మాట్లాడుతూ పెరిగిన గ్యాస్ ఖర్చులు ఇవ్వకుండా యాప్‌ల పేరుతో వేధించడం తగదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ఏఓ మల్లికార్జున రావుకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం. వసంతరావు, నాయకులు సీహెచ్ మణిలాల్, కె. శరత్, పి.మనోజ్, ఐద్వా జిల్లా కార్యదర్శి టి.సుభాషిణి, పంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు కె. శ్రీనివాసరావు, అంగన్‌వాడీ జిల్లా నాయకులు శైలశ్రీ, హేమ, బ్యూలా, ప్రమీల, నిర్మల జ్యోతి, రత్నకుమారి, మేరి, మణి, మల్లేశ్వరి, సుజాత, బసవమ్మ, ప్రమీల, అనిత పాల్గొన్నారు.


