చీరాల: ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ నియోజకవర్గంలో కొనసాగుతోంది. గడువులోపు సర్వే పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు కూడా ఈ కార్యక్రమంపై దృష్టి సారించారు. రోజూ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. స్థానిక లోటుపాట్లు కారణంగా వందశాతం పూర్తి చేయడంపై బీఎల్‌ఓలు తలలు పట్టుకుంటున్నారు. చీరాల నియోజకవర్గంలో చీరాల, వేటపాలెం మండలాల్లో మొత్తం 218 పోలింగ్ బూత్‌లున్నాయి. ఓటర్లు 2,03,641 మంది కాగా... వీరిలో 1,43,533 మంది ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి అయింది. శుక్రవారం నాటికి ఇది మొత్తం 70.48 శాతంగా నమోదైంది. గత నెల 15న మొదలైన సర్ ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడంతో నెమ్మదిగా సాగుతోంది. గడువు 14 వ తేదీ వరకే ఉంది. రెండు దఫాలుగా ఓటు వేసినా 2002 నాటి సర్ వివరాలను అందించాలనే నిబంధన ఉండటంతో ఎక్కువ మంది హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. అప్పటి వివరాలు లభించకపోవడం, వేరే ప్రాంతం నుంచి ఇక్కడకు వలస రావడం, స్థిరనివాసం లేని వారు ఓటు హక్కుకు దూరం కానున్నారు. మైనార్టీలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువ మంది ఉన్నారు. స్థానికంగా ఓటు హక్కు ఉన్నా, 2002 నాటి ఓటు గురించి సమస్యలు తలెత్తుతున్నాయి.
తప్పని పరుగులు
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం నుంచి సమస్యలలో చిక్కుకుంది. మరో నాలుగు రోజులు మాత్రమే మిగలడంతో అధికారులపై ఒత్తిడి, ప్రజలపై భారం మోపుతున్నారు. సర్ కార్యక్రమంపై బీఎల్‌ఓలకు, బీఎల్‌ఏలకు అవగాహన కల్పించారేగానీ ప్రజల గురించి పట్టించుకోలేదు. గడువు దగ్గరపడటంతో ప్రత్యేక క్యాంపుల పేరిట హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. చీరాల మున్సిపాలిటీలో జయంతిపేట, పేరాల మసీదు సెంటర్, పేరాల్లోని ఏఆర్‌ఎం హైస్కూల్, బెస్తపాలెంలోని సచివాలయం, పాపరాజుతోటలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ శిబిరాలను ఏర్పాటు చేసి పూర్తి చేసిన ఫారాలను అందించేందుకు వీలు కల్పించారు. సర్ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను పరిశీలిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు.
చీరాలలో 70.48 శాతం డిజిటలైజేషన్


