● జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
● ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌కు 59 అర్జీలు రేపల్లె: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అందే అర్జీలను అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. పట్టణంలోని ఇసుకపల్లిలో వేంచేసియున్న శ్రీ భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయ కల్యాణ మండపంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ... ప్రభుత్వ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ విధానంలో ఎక్సెల్ షీట్లలో నమోదు చేయాలన్నారు. వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ జిల్లాను రాష్ట్ర ర్యాంకింగ్స్‌లో మొదటి మూడు స్థానంలో నిలిపేలా అధికారులు కృషి చేయాలన్నారు. సిబ్బంది పనితీరు ఆధారంగా అవార్డులు ప్రదానం చేస్తామని, పోటీ స్ఫూర్తితో అందరూ పని చేయాలని తెలిపారు. ప్రజల నుంచి 59 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. జూలై 11న నిర్వహించనున్న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన వాల్ పోస్టర్, బ్యానర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విజయమ్మ, ఆర్డీఓ బూసి శ్రీదేవి, డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, జిల్లా, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వంద శాతం పూర్తి చేయండి
బాపట్ల: సర్ ప్రక్రియ శనివారం సాయంత్రానికి వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాల్‌లో సర్ ప్రక్రియపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం జిల్లాలో చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీకి వస్తారని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి సర్ కార్యక్రమంలో సిబ్బంది నిమగ్నమై ఉండాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, డీఆర్‌ఓ జి. గంగాధర్ గౌడ్, చీరాల ఆర్డీఓ నరసింహారావు, ఎన్నికల పర్యవేక్షకుడు షఫి, తదితరులు పాల్గొన్నారు.