గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం: నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది గ్రీవెన్‌న్స్ డే నిర్వహించారు. జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలోని పోలీస్ సిబ్బంది నుంచి వినతులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు, ఎక్కడికి బదిలీ, వ్యక్తిగత, ఉద్యోగోన్నతులు, సెలవులు, వైద్య అవసరాలపై సిబ్బందితో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రతి వినతిని పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా పరిష్కారిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తొలి ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు.
జిల్లా ఏఆర్ ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకారం
నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను శుక్రవారం ఏఆర్ ఎస్‌ఐ పసుపులేటి చంద్రమౌళి మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఆర్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తించే ఆయన జిల్లాకు బదిలీయ్యారు. అనంతరం ఆయన ఏఆర్ ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు. 2007 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో పల్నాడు జిల్లా, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాలో విధులు నిర్వర్తించారు.
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): టీడీపీ నేత ముజీబ్ కార్యాలయంలో జరిగిన కుటుంబ పంచాయితీ నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బావ తమ్ముడిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. పాతగుంటూరు సుద్దపల్లి డొంకకు చెందిన షేక్ షాజిదబేగంను గత నాలుగు సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామానికి చెందిన షేక్ రఫీకి ఇచ్చి వివాహం జరిపారు. అయితే రెండున్నర సంవత్సరాల క్రితం భార్యా భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో దిశ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అప్పటి పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పి కాపురానికి పంపించారు. మళ్లీ ఏడాది క్రితం ఇరువురి మధ్య వివాదం జరగడంతో మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదై ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ విషయం తెలిసిన షేక్ రఫీ బంధువు బాజి ముజీబ్‌ను సంప్రదించి తమ సమస్యను పరిష్కరించాలని కోరడంతో షాజిద కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆయన కార్యాలయంలో పంచాయితీ జరిగింది. రఫీ, అతని తమ్ముడు జహీర్, కుటుంబ సభ్యులు హాజరు కాగా, ఇటు పక్క నుంచి భార్య షాజిదబేగం, తమ్ముడు షౌకత్ అలి కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడకు వచ్చారు. ఇరువర్గాలతో చర్చించిన అనంతరం మరోసారి పంచాయితీ వాయిదా వేసిన నేపథ్యంలో రఫీ కుటుంబ సభ్యులు బయటకు వస్తుండగా, షాజిదాబేగం తమ్ముడు షేక్ షౌకత్ అలి అతనితోపాటు మరో ఇద్దరు కలిసి రఫీ తమ్ముడు ఇమ్రాన్‌పై కత్తితో దాడిచేసి గాయపరిచారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన షేక్ ఆసీఫ్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఈమేరకు బాధితుడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. కొత్తపేట పోలీసులు విచారణ చేస్తున్నారు.


