యథేచ్ఛగా సాగుతున్న మట్టి అక్రమ త్వకాలు
చేబ్రోలు: ప్రభుత్వ సొమ్ముతో చెరువును అభివృద్ధి చేయాల్సింది పోయి.. చెరువులోని మట్టిని యంత్రాల సహాయంతో తవ్వకాలు చేసి విక్రయించుకొని జేబులు నింపుకుంటున్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి పెద్ద చెరువు వద్ద శుక్రవారం యంత్రాలు, వందలాది ట్రాక్టర్ల వాహనాలతో ఆ ప్రాంతం తిరునాళ్లను తలపించింది. చెరువుల అభివృద్ధి పేరిట అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మట్టిని తవ్వుకొని విక్రయించుకోవటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వడ్లమూడి గ్రామంలో ప్రభుత్వ నిబంధనలకు పాతర వేస్తూ గ్రామంలోని పెద్ద చెరువును ప్రదానమంత్రి కృషి సంచార యోజన (పీఎంకేఎస్‌వై) కింద అభివృద్ధి చేసేందుకు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను సద్వినియోగం చేసి చెరువును బాగు చేయాల్సింది పోయి, దీనిని తమకు అనుకూలంగా మార్చుకొని చెరువులోని మట్టిని కొల్లగొట్టి కోట్లాది రూపాయిల విలువ చేసే మట్టిని వడ్లమూడి పరిసర గ్రామాలకు రియల్ ఎస్టేట్ ప్లాటులకు, ఖాళీ ప్రదేశాలు, భవనాలకు ట్రాక్టర్లు, లారీలతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పచ్చనేతల జేబులు నింపుకుంటూ చెరువు గర్బాన్ని గుల్ల చేస్తున్నారు. వందలాది ట్రాక్టర్లతో మట్టి అక్రమ రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లు తిరుగుతుండటంతో చెరువు ప్రాంతం ఒక పెద్ద తిరునాళ్లను తలపిస్తుంది. కోట్లాది రూపాయిల ప్రభుత్వ సంపదను దోచుకుంటున్న నేతలపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజా పోరాటం తప్పదని స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వడ్లమూడి పెద్ద చెరువులో యథేచ్ఛగా యంత్రాలతో తవ్వకాలు


