గుంటూరు మెడికల్: ప్రపంచ జనాభా వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. ఈ నెల 11 నుంచి 18 వరకు నిర్వహించనున్న ప్రపంచ జనాభా వారోత్సవాల పోస్టర్‌ను శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. కుటుంబ ఆరోగ్యం, మాతృత్వ సంరక్షణ, కుటుంబ సంక్షేమంపై విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు, ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు తదితరులు పాల్గొన్నారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
గుంటూరు లీగల్: జాతీయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధిక సంస్థ ఆధ్వర్యంలో రెండవ జాతీయ లోక్ అదాలత్‌ను ఈ నెల 11వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు గుంటూరు ప్రధాన జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని న్యాయాధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. సివిల్ కేసులు, రాజీకి అనువైన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, బ్యాంకు రుణ వివాదాలు, కుటుంబ వివాదాలు, కార్మిక, విద్యుత్, రెవెన్యూ తదితర కేసులు, ప్రీ–లిటిగేషన్ వివాదాలను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. కక్షిదారులు, న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


