ప్రమాద బాధితులకు వేగంగా పరిహారం
బాపట్ల: రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రమాదాలలో మరణించిన, గాయపడిన బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు అందేలా అధికారులు శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల వివరాలను కలెక్టర్ సమీక్షించారు. పరిహారం మంజూరు మరింత వేగవంతం చేయాలని సూచించారు. రవాణా శాఖలో ఆన్‌లైన్ ద్వారా అమలవుతున్న వాహన్, సారథి సేవల పనితీరును పరిశీలించారు. పర్మిట్లు, పన్నుల చెల్లింపు విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె. పరంధామ రెడ్డి, బాపట్ల ఆర్‌డీఓ గ్లోరియ, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జున, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు రంగారావు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యాలను అధిగమించాలి
స్వర్ణాంధ్ర కేపీఐసీ లక్ష్యాలను అధికారులు అధిగమించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయా శాఖల జిల్లా అధికారులతో గురువారం ఆయన స్థానిక కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ బాపట్ల దిశగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, పరిశుభ్రమైన తాగునీటిని అందించడం చాలా ముఖ్యమన్నారు. పబ్లిక్ హెల్త్ నుంచి 49 శాతం కుళాయి కనెక్షన్ ఇవ్వాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం 43 శాతమే ఇవ్వడంపై నిలదీశారు. మురుగు నీటిని శుద్ధి చేసే కేంద్రాలు మున్సిపాలిటీలలో ఏర్పాటు చేయాలన్నారు. శుద్ధి చేసిన తర్వాత ఆ నీటిని వినియోగించుకోవడం, వాటిని సురక్షితమైన పద్ధతిలో బయటకు విడుదల చేయడం వంటివి చేయాలన్నారు.
తాగునీరు అందించాలి
గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా 4,493 కుళాయి కనెక్షన్‌లు ఇవ్వాలని లక్ష్యం కాగా, కేవలం 200 మాత్రమే చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని వాటర్ ప్లాంట్లన్నింటినిలో నీటి పరీక్షలు నిర్వహించాలన్నారు. పంచాయతీరాజ్ కింద 49.93 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాల్సి ఉండగా, కేవలం రెండు కిలోమీటర్లు నిర్మించడం ఏంటని నిలదీశారు. చాలా పనులు టెండర్ దశలో ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వేగంగా నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు.
కలెక్టర్ అసంతృప్తి
ఆర్ అండ్ బీ రహదారుల నిర్మాణ పనుల లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు. మూడు నెలలలో 28.93 కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని లక్ష్యం కాగా, కేవలం 14.2 కిలోమీటర్ల నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన లక్ష్యాలు చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. గృహ నిర్మాణశాఖ ద్వారా 700 గృహాలకుగాను ఇప్పటివరకు 259 నిర్మించడంపై చర్చించారు. లబ్ధిదారులను చైతన్యపరచడం, అప్రమత్తంగా ఉండి నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూగర్భ ఖనిజ సంపదపై దృష్టి సారించాలన్నారు. పీఎం శ్రీ పథకంలో రూ.ఐదు కోట్లు నిధులు జిల్లాకు మంజూరు కాగా, 87 పనులకుగాను 28 ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అమృత్– 2 పనులు చేపట్టాలన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలని సూచనలు చేశారు. ఈ సమావేశంలో సీపీఓ షాలేము రాజు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఆంజనేయులు, గృహ నిర్మాణశాఖ పీడీ వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ డీఈ అరుణకుమారి, తదితర అధికారులు పాల్గొన్నారు.


