రాయి గరుడుడు అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్‌లోగల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం శ్రీవారిని రాయిగరుడుడుగా అలంకరించి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు మాట్లాడుతూ రాయిగరుడు విశిష్టతను వివరించారు.
రేపు ఉపకార వేతనాలు పంపిణీ
గుంటూరు ఎడ్యుకేషన్: కాకతీయ స్టూడెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 11న ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.61 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య తెలిపారు. శుక్రవారం గుంటూరులోని డాక్టర్ కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయ, సహకారాలను అందించే ఆశయంతో 2003లో సొసైటీని ప్రారంభించినట్లు చెప్పారు. ఈనెల 11న కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న 23వ ఉపకార వేతన పంపిణీ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ, పీజీ చదువుతున్న 440 మంది విద్యార్థులకు రూ.61 లక్షలు చెక్కుల రూపంలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా రానున్నారని చెప్పారు. సొసైటీకి రూ.కోటి విరాళాన్ని అందజేసిన కెనడాకు చెందిన ముఖ్యదాత డాక్టర్ పుట్టగుంట వేణుగోపాలరావు కుమార్తె డాక్టర్ పుట్టగుంట లక్ష్మి హాజరవుతున్నట్లు చెప్పారు. సమావేశంలో సొసైటీ కార్యదర్శి డాక్టర్ కె.కృష్ణప్రసాద్, బొప్పన ద్వారకాప్రసాద్, వడ్లమూడి గోవర్ధనరావు, నామినేని కోటేశ్వరరావు, రామారావు పాల్గొన్నారు.
బీఆర్ స్టేడియం అభివృద్ధికి రూ. 14 కోట్లు మంజూరు
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు నగరంలోని ప్రఖ్యాత బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్టేడియం అభివృద్ధి కోసం గతంలో రూ.170 కోట్ల క్రీడా మౌలిక వసతుల ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఖేలో ఇండియా పథకం కింద మల్టీ–స్పోట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఈ నిధులు మంజూరు చేసిందన్నారు. దీంతోపాటు దశల వారీగా నిధులను సేకరిస్తామని తెలిపారు. ఈ నిధులతో విశాలమైన స్టేడియం అభివృద్ధి చెంది ఔత్సాహిక క్రీడాకారులు అందుబాటులోకి వస్తారన్నారు.
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 2,519 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 11.5 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. బ్యాంక్ కెనాల్ 150 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 267, పశ్చిమ కాలువకు 60, నిజాంపట్నం కాలువకు 31, కొమ్మూరు కాలువకు 1,360 క్యూసెక్కులు విడుదల చేశారు.
రాయి గరుడుడు అలంకరణలో శ్రీవారు
రాయి గరుడుడు అలంకరణలో శ్రీవారు
రాయి గరుడుడు అలంకరణలో శ్రీవారు


