రెక్కలు రాని ప్రేమలు
● టెక్నాలజీతో తెలివిమీరుతున్న పిల్లలు ● సోషల్‌మీడియాతో హద్దులు దాటుతున్న మైనర్లు ● ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని, తోటి విద్యార్థి ప్రేమవలలో పడింది...అతడు అడిగితే కాదనకుండా హోటళ్లకూ వెళ్లింది...సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలతో బెదిరించటంతో బెంబేలు పడి పోలీసులకు ఫిర్యాదుచేసింది.
● మరో ఇంజినీరింగ్ విద్యార్థిని కాలేజీకని వెళ్లి, ఇంటికి తిరిగిరాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 42 రోజుల తర్వాత పోలీసులు తీసుకొచ్చారు. అదికూడా ప్రేమ పైత్యమేనని వెల్లడైంది.
● తెనాలిలో కొత్త సంవత్సరంలో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యతో కొన్ని నెలల వ్యవధిలో జరిగిన పై ఘటనలు మనసున్న వారిని కలచివేస్తున్నాయి. రెక్కలు రాని పసికూనల నుంచి మైనారిటీ తీరని యువతుల వరకు పలువురు ప్రేమ మైకంలో మునిగి తేలుతున్నారు. అభం శుభం తెలియని వయసులో అబ్బాయిలతో స్నేహాలు వారి కొంపలు ముంచుతున్నాయి. జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కుటుంబాలకు తీరని కడుపుకోతను మిగుల్చుతున్నాయి.
● ఇంటర్ చదువుతున్న ఓ బాలిక గత అక్టోబరు–నవంబరులో కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆ బాలిక ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు.
● ఇంజినీరింగ్ ప్రథమ ఏడాది చదువుతున్న మరో యువతి ఇంటి నుంచి వెళ్లిపోవటంతో చేసేదిలేక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. రెండురోజులకు ఆటోడ్రైవర్‌ను వివాహం చేసుకుని నవదంపతులు పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యారు. ఆ అమ్మాయి చదువు ఆగిపోయింది. తల్లిదండ్రులు ఆ వివాహాన్ని అంగీకరించలేదు.
● తెనాలి సమీప గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని ప్రేమపురాణం గురించి తల్లిదండ్రులకు తెలిసింది. నయాన భయాన చెప్పి చూశారు. మాట వినే రకంగా కాదని ‘నీ ఇష్టం వచ్చినవాడిని పెళ్లి చేసుకో...ఇంజినీరింగ్ పూర్తిచేశాక’ అని స్పష్టంగా చెప్పారు. సరేనని నమ్మకంగా చెప్పిన ఆ విద్యార్థిని ఓ మంచిరోజు చూసుకుని, ఆ అబ్బాయితో సహా అదృశ్యమైంది.
● టెక్నాలజీతో తెలివిమీరిన ఆ పిల్లలు, తమ ఆచూకీ ఎవరికీ తెలియకుండా సెల్‌ఫోన్లు వాడటం ఆపేశారు. ఎట్టకేలకు శ్రమపడి పోలీసులు వారి జాడ తెలుసుకున్నారు. 42 రోజుల తర్వాత ఇంటికి చేరిందా అమ్మాయి. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నా, చదువుతున్న ఇంజినీరింగ్ కూడా పూర్తిచేయని ఆ ఇద్దరూ ‘ఏం ఉద్యోగం చేస్తారు? ఎలా జీవనం సాగిస్తారు?’ అనుకుంటూ కుటుంబ సభ్యులు పడిన ఆవేదన అంతా ఇంతా కాదు.
● తెనాలికి చెందిన మరో విద్యార్థిని యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చేస్తోంది. డిసెంబరు మొదటివారంలో కాలేజీకని బయలుదేరిన కుమార్తెను తండ్రి తన వాహనంపై తీసుకొచ్చి బస్టాండులో వదిలిపెట్టారు. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్లకుండా ప్రేమికుడితో వెళ్లి, పెళ్లి చేసుకుని మరీ ఇంటికి రావటంతో ఆ పెద్దలకు నోటమాట రాలేదు.
● ఇక ప్రేమ పేరుతో సన్నిహితంగా ఉంటే, ఆ ఫొటోలు, వీడియోలు జీవితాంతం వెంటాడతాయని తెలిసినా కొందరు గీత దాటుతున్న దుష్టాంతాలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ఇందుకు కారణాలు ఒకప్పుడు టీవీ, సినిమాలు అని చెప్పుకున్నా ఇప్పుడు ఎక్కువశాతం సోషల్ మీడియానే కారణమనే భావన వ్యక్తమవుతుంది.
ప్రేమ పేరుతో భవిష్యత్ నాశనం చేసుకోవద్దు...
తెనాలి: పదవ తరగతి విద్యార్థి ప్రేమపాఠాలు...ఆ పేరుతో డబ్బు వసూలు...నూతన సంవత్సరం వేడుకలకు చేయి కోసుకుంటాననీ, టీసీ తీసుకు వెళ్లిపోతానని బెదిరింపులు...ఆ ఒత్తిడి తట్టుకోలేక, డబ్బులు ఇవ్వలేక మానసిక క్షోభకు గురైన తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఎలుకల మందు తిని ఆసుపత్రి పాలైంది. ఏడు రోజులపాటు నరకం చూసి చివరకు మృతి చెందింది. కన్న తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది.
మైనారిటీ తీరకుండానే ప్రేమపురాణాలు ..
తెనాలి నియోజకవర్గంలో గత పది నెలల్లో దాదాపు 22 మంది బాలికలు అదృశ్యమైనట్టు కేసులు నమోదయ్యాయి. ఇద్దరు పెళ్లి చేసుకుని తిరిగొచ్చారు. మిగిలిన వాటిలో ఒకటి మినహా అన్నీ తెలిశాయి. వీటిలో ఎక్కువశాతం ప్రేమ నేపథ్యమే.
విద్యార్థులు చదువుపై
దృష్టి పెట్టాలి. బంగారు భవిష్యత్ కోసం ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని చేరుకునేలా కష్టపడాలి. ప్రేమ అంటూ చిన్న వయసులో భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు. ప్రేమ పేరిట మైనర్‌ను వేధించినా, ఇద్దరికీ ఇష్టమేనని ప్రేమ పేరుతో మైనర్ల వెంట పడినా పోక్సో కేసు నమోదు చేస్తాం. మైనర్‌ను పెళ్లి చేసుకున్నా నేరమే. పోక్సో యాక్టు కింద శిక్ష తప్పదు.
– బి.జనార్ధనరావు, తెనాలి డీఎస్పీ
1/1
రెక్కలు రాని ప్రేమలు