అల్లుడు చేతిలో మామ హతం
మార్టూరు: మద్యం మత్తులో మామను అల్లుడు కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన మార్టూరులో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక క్వారీ కుంటల్లో నివాసం ఉండే కొప్పరపు హుస్సేన్ సాహెబ్ (50)కు తన అల్లుడు నూర్ బాషాతో సాయంత్రం మద్యం తాగే దగ్గర ఘర్షణ జరిగింది. అనంతరం ఇంటికి చేరుకున్న హుస్సేన్ సాహెబ్‌ను అల్లుడు నూర్ బాషా తన ఇంటిలోని కత్తి తీసుకొని వెళ్లి మామ పొట్టలో విచక్షణారహితంగా పొడిచాడు. అపస్మారక స్థితికి చేరుకున్న హుస్సేన్ సాహెబ్‌ను పొడిచిన అల్లుడే స్వయంగా ఆటోలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. కొన ఊపిరితో ఆసుపత్రికి చేరిన హుస్సేన్ సాహెబ్ కొద్దిసేపటికి మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


