తీరంలో తమ్ముళ్ల భూదందా
చినగంజాం: అధికార పార్టీ అండదండలతో కొందరు స్వార్థ పరులు తీర ప్రాంత భూములను కొల్లగొట్టి కోట్లు గడిస్తున్నారు. అమాయక ప్రజలను మభ్యపెట్టి కోటీశ్వరులుగా మారిపోతున్నారు. చినగంజాం మండలం పెదగంజాం గ్రామ రెవెన్యూ పరిధిలో తీరం వెంబడి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ భూములు లక్ష్యంగా చేసుకొని స్వార్థ పరులు దోచుకుంటున్నారు. సర్వే నంబర్ 1160లో వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములతో పాటు సర్వే నంబర్ 656, 657, 658, 659, 668, 660, 661లో ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూముల్లో పాగా వేసి అమ్మేసుకుంటున్నారు. మడ అడవులను సైతం నరికేస్తున్నారు. తాతల కాలం నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ప్రైవేట్ వ్యక్తుల భూములన్నీ స్వాధీనం చేసుకుంటున్నారు. పూర్వం భూములను మత్స్యకార, యాదవ సామాజిక వర్గాల వారు బ్రాహ్మణులకు సేవ చేసుకుంటూ నాటువైద్యం, ఇంటి పనులు చేసి పెట్టి వారి మెప్పును పొంది బహుమతిగా అందుకున్నారు. గతంలో సాగు చేసినప్పటికీ గత 20 ఏళ్లుగా ఉప్పు నీటి ప్రభావంతో సాగు నిలిపివేశారు.
వియ్యం అందుకుని...
బాపట్ల మండలానికి చెందిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి చినగంజాం మండ లంలో తన సామాజిక వర్గానికి చెందిన స్థానికుల తో వియ్యం అందుకొని తరచూ మండలానికి రాకపోకలు సాగిస్తూ 2023లోనే తీరం వెంబడి భూములపై కన్నేశాడు. చిన్న డ్రైనేజీలను పూడ్చి రొయ్యలు చెరువులుగా మార్చడం, రొయ్యల చెరువుల యజమానులను భయభ్రాంతులకు గురిచేసి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడం, మరికొన్ని భూములను కబ్జా చేయడంతో తన కబ్జాల వ్యవహారాన్ని మొదలు పెట్టాడు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ అండదండలతో పెదగంజాం తీరం వెంబడి ప్రభుత్వ భూమి 75 ఎకరాలు, ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూములు 30 ఎకరాల భూముల్లో మార్కెట్ పరంగా కోట్ల విలువైన ఆస్తులను కబ్జా చేసుకొని దర్జాగా అమ్మేసుకుంటున్నాడు.
తీరంలో తమ్ముళ్ల భూదందా


