దేశ విజ్ఞాన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిన నాగార్జునుడ
ఏఎన్‌యూ(పెదకాకాని): ప్రాచీన భారత విజ్ఞాన చరిత్రలో ఆచార్య నాగార్జునుడికి విశిష్ట స్థానం ఉందని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు అన్నారు. వర్సిటీ రసాయనశాస్త్ర విభాగం, సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జునుడి ఆల్కెమికల్ వారసత్వం–సంప్రదాయిక, ఆధునిక దృక్పథాలు అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ముగింపు సభకు జాతీయ సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ దిట్టకవి రామచంద్రన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కంచర్ల గంగాధర్‌రావు మాట్లాడుతూ మెటలర్జీ, కెమికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో ఆయన ఆలోచనలు ప్రేరణగా మారాయన్నారు. ఆయుర్వేదం, సిద్ధ వైద్యం వంటి రంగాలపై ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.
సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ రామచంద్రన్ మాట్లాడుతూ తమిళనాడు, కేరళ, తెలంగాణ, న్యూఢిల్లీ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల నుంచి సుమారు 300 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని, పరిశోధన పత్రం సమర్పించారని తెలిపారు. జబల్పూర్, మంగళాయతన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కే ఆర్‌ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ ప్రయోగాత్మక దృక్పథం, పరిశీలన పద్ధతులు, శాసీ్త్రయ తత్వం నాగార్జునుడి రచనలలో స్పష్టంగా కనిపిస్తాయన్నారు. చాణిక్య ఎడ్యుకేషన్ హబ్ ప్రతినిధి డాక్టర్ ఇంకుర్తి వెంకట్ మాట్లాడుతూ శాసీ్త్రయ పరిశోధనలో కృత్రిమ మేధస్సు దోహదపడుతుందన్నారు. అనంతరం పరిశోధన పత్రాలు సమర్పించిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి రోశయ్య, ఓఎస్‌డి ఆచార్య ఆర్‌విఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్, పాలకమండలి సభ్యులు సీహెచ్ ఏపీ రామేశ్వరరావు, నూట అధ్యక్షులు ప్రొఫెసర్ బ్రహ్మాజీ, ప్రొఫెసర్ సుబ్బారావు, ప్రొఫెసర్ రమేష్ రాజు, జాతీయ సదస్సు కో కన్వీనర్ ప్రొఫెసర్ పి.సుధాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బిహెచ్.మల్లికార్జునరావు, జనరల్ సెక్రెటరీ బి.సత్యనారాయణ, ట్రెజరర్ డాక్టర్ పి.భరత్ తదితరులు పాల్గొన్నారు.


