
పొగాకు రైతులకు అండగా ఉంటాం
ఏపీ వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఎస్‌డబ్ల్యూసీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ సునీత పర్చూరులో పొగాకు గోదాముల పరిశీలన
పర్చూరు(చినగంజాం): సంక్షోభం నుంచి రైతులను బయటకు తెచ్చేలా పొగాకు కొనుగోలు చేపట్టాలని ఏపీ వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, ఎస్‌డబ్ల్యూసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. జిల్లాకు వచ్చిన ఆమె కలెక్టర్ జె. వెంకటమురళితో కలసి పర్చూరు మండలంలో శనివారం పర్యటించారు. పర్చూరు మండలం మార్కెట్ యార్డులోని గోదాముల్లో నిల్వ చేసిన పొగాకు బేళ్లను ఎండీ విజయ సునీత, కలెక్టర్ జె.వెంకట మురళి పరిశీలించారు. వాటి నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన అనంతరం కొనుగోలు తీరుపై ఆరా తీశారు. జిల్లా పర్యటనలో భాగంగా బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు, గోదాముల్లో నిల్వ, ప్రాసెసింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సమావేశం అయ్యారు. పొగాకు ప్రాసెసింగ్ కోసం సిద్ధం చేసిన డబ్ల్యూబీఆర్, డబ్ల్యూబీఎల్, డబ్ల్యూబీఎక్స్ రకాల నమూనాలను పరిశీలించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన పొగాకును ప్రాసెసింగ్ చేయడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల పరిశీలన పూర్తయితే తక్షణమే వారికి నగదు పంపుతామన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. బాపట్ల జిల్లాలో 9,900 టన్నుల బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేశామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాన్నాయన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన బ్లాక్ బర్లీ పొగాకు నిల్వ చేయడానికి 18 వ్యవసాయ మార్కెటింగ్ శాఖ గోదాములను గుర్తించామని తెలిపారు. మరో 11 ప్రైవేట్ గోదాములు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. మార్కెటింగ్ శాఖ ఆర్‌జేడీ కె.శ్రీనివాసరావు, ఆర్‌డీ డీఎం దివాకర్, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి కె.రమేష్ బాబు, మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ, ఆర్డీఓ పి.గ్లోరియా తదతరులున్నారు.