దారుణ పాశం..! | - | Sakshi
Sakshi News home page

దారుణ పాశం..!

Sep 1 2025 2:53 AM | Updated on Sep 1 2025 2:53 AM

దారుణ పాశం..!

దారుణ పాశం..!

లోన్‌ యాప్‌ల మాయలో కూరుకుపోతున్న యువకులు ఆర్థిక అవసరాల కోసం పెద్ద మొత్తంలో అప్పులు అధిక వడ్డీ చెల్లించకుంటే బాధితులకు తీవ్ర వేధింపులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న రుణగ్రహీతలు

అప్పు సులభంగా ఇస్తున్నారని యాప్‌లతో మోసపోతున్న యువత

జె.పంగులూరు: అవసరాలు కావచ్చు.. జల్సాలు చేయడానికి కావచ్చు.. కారణమేదైనా లోన్‌ యాప్‌ల ట్రాప్‌లో పడుతున్న యువత జీవితాలను నాశనం చేసుకుంటోంది. ఎలాంటి దస్తావేజులతో పనిలేదు... ప్రాంశరీ నోట్లపై సంతకాలు కూడా అవసరం లేదు... యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో వివరాలు నమోదు చేస్తే చాలు... చిటికెలో అప్పు చేతికి అందుతోంది. నగదు అత్యవసరమైన వారికి ఇది చాలా తేలిక. కొందరు గూగుల్‌ పే, ఫోన్‌ పేల్లో వచ్చిన ప్రకటనలు చూసి, ప్లేస్టోర్‌లో ఆన్‌లైన్‌ మనీ యాప్‌లను గాలించి డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. వారు అడిగిన అనుమతులన్నీ ఇచ్చేస్తున్నారు. గుర్తింపు, చిరునామాల కోసం ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డుల వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. అనంతరం లోన్‌ యాప్‌ నిర్వాహకుల ట్రాప్‌లో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నారు.

సిబిల్‌ స్కోర్‌ కోసం...

అత్యవసరం నిమిత్తం కొంతమంది ఆన్‌లైన్‌ మనీ యాప్‌లు వినియోగిస్తున్నారు. మరికొంత మంది సిబిల్‌ స్కోర్‌ను పెంచుకోవడాలని యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంక్‌లు క్రెడిట్‌ కార్డులు ఇవ్వాలన్నా, ఏదైనా వస్తువును ఈఎంఐ పద్ధతిపై కొనాలన్నా సిబిల్‌ స్కోర్‌ తప్పనిసరి. చివరికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలన్నా ఇదే ఆధారం. ఈ స్కోర్‌ తక్కువగా ఉన్న వారందరూ ఈ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుంటున్నారు. సాధారణంగా సిబిల్‌ స్కోర్‌ ప్రతి ఆరు నెలలకోసారి అప్‌డేట్‌ అవుతుంది. ఆన్‌లైన్‌ మనీ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకుంటే తక్కువ రోజుల్లోనే తిరిగి చెల్లించాలి. అంతా అనుకున్నట్లు జరిగితే సిబిల్‌ స్కోర్‌ పెరుగుతుంది. తక్కువ మొత్తంలో అప్పు తీసుకొని సిబిల్‌ స్కోర్‌ను పెంచుకుందామనే ఆలోచనలో చాలా మంది యాప్‌ల మాయలో చిక్కుతున్నారు. తద్వారా సిబిల్‌ స్కోర్‌ పెంచుకోలేక, తీసుకున్న అప్పు తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

విలాసాల కోసం ట్రాప్‌లో విద్యార్థులు

డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులు విలాసాలకు అలవాటు పడుతున్నారు. పార్టీలు, ఎంజాయ్‌మెంట్లకు ఆర్థిక అవసరాలు పెరుగుతున్నాయి. ఇళ్లలో తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు ఈ అవసరాలను తీర్చలేకపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి యువకుడి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండటంతో అవసరమైనప్పుడల్లా డబ్బులు యాప్‌ల ద్వారా అప్పుగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్న డబ్బుతో అవసరాలను తీర్చుకుంటున్నారు. యాప్‌లలో రుణాలు అసలు, వారు వేసే అధిక వడ్డీ చెల్లించలేకపోతున్నారు.

తీవ్ర వేధింపులు

యాప్‌ల నిర్వాహకులు విధించే వడ్డీ అడ్డూఅదుపు లేకుండా పోతోంది. రూ. 7 వేలు తీసుకున్న బాధితుడిని పది రోజుల్లోనే రూ. 12 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అసలు కన్నా వడ్డీ దాదాపుగా రెట్టింపు వసూలు చేశారు. వాస్తవానికి జాతీయ బ్యాంకులు సిబిల్‌ స్కోర్‌ను బట్టి వడ్డీలు ఉంటాయి. పక్కాగా ఈఎంఐలు చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. వాటిని కాదని ఒక్కసారి ఈ యాప్‌ల వలలో చిక్కితే తీవ్ర ఇబ్బందులు తప్పవు.

మార్ఫింగ్‌ చిత్రాలతో బెదిరింపులు

లోన్‌ మంజూరు చేసే సమయంలో యాప్‌లో నమోదు ప్రారంభించగానే ఫోన్‌లోని సమాచారం అంటే కాంటాక్ట్‌ లిస్ట్‌, ఫొటోలు వంటి వాటిపై నిర్వాహకులకు పర్మిషన్‌ లభిస్తుంది. వారడిగినట్లుగా డబ్బు చెల్లించకపోతే మొదట బంధువులు, స్నేహితులకు ఫోన్‌ చేసి ఫలానా వ్యక్తి లోన్‌ చెల్లించడం లేదని చెబుతారు. రెండోసారి... లోన్‌ తీసుకున్న వ్యక్తి ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తామని బెదిరిస్తారు. సెల్‌ఫోన్‌లో ఉన్న మహిళల నఫోను ెనంబర్లకు అశ్లీల చిత్రాలను పంపిస్తామని హెచ్చరిస్తుంటారు. అసలు తీసుకున్న లోన్‌తో సంబంధం లేకుండా వాళ్లడిగినంత ఇచ్చినప్పటికీ ఇంకా కావాలని వేధిస్తారు. ఫోన్‌ అంటుకోవాలంటే భయపడేలా మాటల దాడిని పెంచుతారు. చివరకు జీవితంపై విరక్తి వచ్చేలా చేస్తారు. ఒక్క సారి ఈ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకొని అన్ని వివరాలు ఇచ్చారంటే వారి వలలో చిక్కినట్టే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement