
పుష్టిగా పశు సంపద సృష్టి!
సరోగసి విధానంలో మేలుజాతి ఒంగోలు గిత్తల అభివృద్ధికి పెరిగిన అవకాశాలు
ఐవీఎఫ్ పద్ధతిలో కోరుకున్న
దూడల సృష్టి
తొలిసారి బొల్లాపల్లి గ్రామంలో
నరసింహ అనే ఒంగోలు జాతి
కోడెదూడ రెండేళ్ల క్రితం జననం
వ్యవసాయ రంగంలో వినూత్న
సరోగసి ద్వారా 20కుపైగా దూడలు
మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి గ్రామంలో సరోగసి విధానంతో జన్మించిన ఒంగోలు జాతి గిత్త నరసింహతో జిల్లాలో పశువులలో సరోగసి విధానాన్ని మొదటిసారిగా దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభించారు.
జన్యు సంరక్షణ
పశువులలో సరోగసి విధానం ద్వారా మేలైన పశుసంపద సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ, తిరుపతిలోని వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్త కార్యాచరణ రాష్ట్రీయ గోకుల్ మిషన్‌లో భాగంగా శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ లీలాకృష్ణ, చదలవాడ పశు ఉత్పత్తి కేంద్రం ఏడీఏ డాక్టర్ బీ రవి, డాక్టర్ సోమశేఖర్‌తోపాటు మార్టూరు ఏడీఏ పద్మావతి, మార్టూరు మండలం కోలలపూడి పశు వైద్యురాలు మాధవీలతల బృందం కృషి ఎంతో ఉంది.
మేలు జాతి కోసం
సాధారణంగా ఒక ఆవు తన జీవితకాలంలో 8 నుంచి 10 దూడలను ఈనగలదు. మేలు జాతి ఆవు నుంచి సేకరించిన అండాలతో ఫలదీకరించిన 150 పిండాల ద్వారా సరోగసి విధానంలో 50 నుంచి 60 వరకు మేలు జాతి దూడలను పొందవచ్చు. ఈ పద్ధతి ద్వారా వయసు మీరిన, గాయపడిన, సహజ పద్ధతిలో సంతానోత్పత్తి చేయలేని ఆవుల నుంచి సైతం పిండాలను అభివృద్ధి చేయటం ద్వారా దూడలను పొందవచ్చు. ఈ విధానానికి సహజంగా తక్కువ పాల దిగుబడి ఉన్న ఆవుల గర్భాలను వైద్యులు ఎంచుకుంటారు. పాల దిగుబడి ఎక్కువగా ఇచ్చే మేలు రకపు ఆవుల నుంచి సేకరించిన అండాలతో మరో మేలు జాతి కోడెదూడల వీర్యంతో ఫలదీకరణ చేయబడిన పిండాలను ఈ ఎంపిక చేయబడిన ఆవుల గర్భంలో ప్రవేశపెడతారు. తద్వారా మేలురకపు పశు సంపద ఉత్పత్తి జరుగుతుంది. సరోగసి విధానం వలన అంతరించిపోతున్న పుంగనూరు, ఒంగోలు జాతి గిత్తలను గణనీయంగా ఉత్పత్తి చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. గతంలో బ్రెజిల్‌కు ఎగుమతి చేయబడిన ఒంగోలు జాతి గిత్త మూలాలు కలిగిన కోడె దూడ ఇటీవల అదే దేశంలో అక్షరాల రూ.41 కోట్ల ధర పలికిన విషయం తెలిసిందే.
ప్రయోజనాలు ఎన్నో..
సరోగసి విధానం ద్వారా అధిక పాల ఉత్పత్తిని ఇచ్చే సామర్థ్యం గల ఆవులను సృష్టించవచ్చు. తద్వారా గణనీయమైన పాల ఉత్పత్తిని సాధించటంతోపాటు ఎగుమతులు చేయవచ్చు. మేలు జాతి కోడెదూడలను ఉత్పత్తి చేయడం ద్వారా వ్యవసాయంలో వినియోగించుకునే అవకాశం ఉంది. ఒంగోలు జాతి కోడె దూడల వీర్యానికి ప్రపంచస్థాయిలో ఉన్న డిమాండ్, పేరు ప్రఖ్యాతులు దృష్ట్యా ఇతర దేశాలకు ఎగుమతులు సైతం చేసుకొనే వాణిజ్యపరమైన అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం విస్తరిస్తున్న ప్రకృతి సేద్యంలో భాగంగా గో వ్యర్థాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. తదద్వారా ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పెంపకాలకు ఎంతో అవకాశం ఉంది.
ఒరవడితో ఎన్నో ప్రయోజనాలు
సరోగసి (అద్దె గర్భం) విధానం మనుషుల్లోనేకాక పశువులలో కూడా అభివృద్ధి చేయడం ద్వారా వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి గిత్తలను సరోగసి విధానంతో ఉత్పత్తి పెంచడం ద్వారా వ్యవసాయ పరంగానే కాకుండా పాల ఉత్పత్తి, పశువుల ఎగుమతి ద్వారా వాణిజ్యపరంగా కూడా అభివృద్ధి
సాధ్యపడనుందని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు.
పశు ఉత్పత్తి పెంపుతో ప్రయోజనాలు
సరోగసి విధానం ద్వారా మేలు జాతి పశు ఉత్పత్తి పెరగడం వల్ల పాల దిగుబడి అధికం కానుంది. రైతులకు ఆదాయం చేకూరుతుంది. పంటల గిట్టుబాటు ధరలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న వేళ పాల ఉత్పత్తి ద్వారా రైతులు నికరాదాయాన్ని పొందగలుగుతారు. ప్రకృతి సేద్యంలో నేడు వినియోగిస్తున్న అన్ని రకాల కషాయాల తయారీకి గో ఆధారిత వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. ఆరోగ్యకరమైన పంటలను పండించగలుగుతున్నారు.
– వీరవల్లి కృష్ణమూర్తి, మార్టూరు మండల రైతు సంఘం అధ్యక్షుడు