
అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలి
సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల
రేపల్లె: పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించతలబెట్టిన జాతీయ లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా పోలీసులు, న్యాయవాదులు కృషి చేయాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఎస్‌పీడీ వెన్నెల కోరారు. సెప్టెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ లోక్‌అదాలత్‌పై స్థానిక కోర్టు హాలులో శనివారం పోలీసులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్‌అదాలత్ ద్వారా కేసులు త్వరగా పరిష్కారం అవ్వటంతోపాటు కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. లోక్‌అదాలత్‌లో క్రిమినల్, సివిల్, ప్రిలిటిగేషన్‌లతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్, బ్యాంక్‌లకు సంబంధించిన కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దివ్యసాయి శ్రీవాణి, సీనియర్ న్యాయవాదులు పీఎన్‌బీ శర్మ, జీ.వెంకటేశ్వరరావు, కే.నాగాంజనేయలు, పోలీసు, రెవెన్యూ, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.