సమయపాలన పాటించని వైద్యులు ప్రైవేటు వైద్యశాలల వైపు చూపు
కొల్లూరు: ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. జ్వర పీడితులు, ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగులు గంటల కొద్దీ పడిగాపులు పడుతున్నారు. ఊరూర జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండాల్సిన వైద్యులు ఇష్టానుసారం విధులకు హాజరవుతున్నారు. దీంతో రోగులు అవస్థలు పడుతున్నారు. కొల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యాధికారిణితోపాటు, అదనపు వైద్యులు వైద్య సేవలు అందించడానికి సమయానికి అందుబాటులో ఉండని కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం జ్వరపీడితులతోపాటు, ఇతర రోగులు వైద్య పరీక్షల కోసం వైద్యశాలకు వచ్చి వైద్యుల కోసం 10 గంటల వరకు వేచి చూసినా పత్తా లేకపోవడంతో జ్వర పీడితులు నీరసించి కూలబడ్డారు. జ్వరంతో బాధపడుతున్న ఓ చిన్నారిని తండ్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నీరసించిన చిన్నారిని ఓపీ విభాగం కోసం నిర్మించిన గోడపై పడుకోపెట్టి నిరీక్షించాల్చి వచ్చింది. వైద్యులు సమయానికి అందుబాటులో లేని కారణంగా కొంత మంది జ్వర బాధితులు వేచి ఉండే ఓపిక లేక ప్రైవేటు వైద్యశాలలకు తరలివెళుతున్నారు.
పీహెచ్‌సీల్లో జ్వర పీడితుల పడిగాపులు